Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 12న తన 72వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. తలైవా బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. అయితే ఆ రోజు కాకుండా బుధవారం (14న) సాయంత్రం తన కుమార్తె ఐశ్వర్యతో కలసి రజనీకాంత్ తిరుమలకు వచ్చారు. టీటీడీ అధికారులు రజనీకాంత్, ఆయన కుమార్తె దర్శనానికి తగిన ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు ఉదయం రజనీకాంత్, ఆయన కూతురు ఐశ్వర్య స్వామిని దర్శించుకున్నారు.
ప్రత్యేక క్యూలైన్ నుంచి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు రజనీకాంత్ అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించేందుకు రజనీకాంత్ వెళ్లారు. దర్గా దర్శనానికి ఏఆర్ రెహమాన్ కూడా రానున్నారు. అయితే రజనీకాంత్ తన బీఎండబ్ల్యూ కారులో చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. అయితే రజనీకాంత్ ప్రయాణించిన కారుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా జరిగింది.
![Rajinikanth : రజనీకాంత్‌కి కారు తిప్పలు.. సెలబ్రిటీలకి రూల్స్ ఉండవా అంటూ ట్రోల్స్.. Rajinikanth getting trolled by netizen for his car insurance](http://3.0.182.119/wp-content/uploads/2022/12/rajinikanth.jpg)
రజనీకాంత్ ప్రయాణించిన బీఎండబ్ల్యూ ఎక్స్ 5 మోడల్ కారు నంబర్ టీఎన్ 06 ఆర్ 9297 కాగా, ఈ కారు రజనీకాంత్ పేరు మీద ఉంది. చెన్నై సౌత్ ఈస్ట్‌లోని మందవేలి ఆర్‌టీఓ కార్యాలయంలో ఆగస్టు 4, 2016న రిజిస్ట్రేషన్ అయింది. ఈ కారు ఇన్స్యూరెన్స్ గడువు ఆగస్టు 02, 2021లోనే పూర్తయినా ఇప్పటివరకు రెన్యువల్ కాలేదని రవాణాశాఖ వెబ్‌సైట్లో చూపిస్తోంది. అయితే కోట్లాది రూపాయలు ఉన్న రజనీకాంత్ ఇప్పటి వరకు ఎందుకు ఇన్సూరెన్స్ చేయలేదు, 16 నెలలుగా ఇన్స్యూరెన్స్ లేకుండానే ఆ కారు రోడ్లపై పురుగులు తీస్తుంటే చెన్నై ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. రూల్స్ సామాన్యులకేనా.. సెలబ్రెటీలకు వర్తించవా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక రజనీకాంత్ కొత్త చిత్రం ‘లాల్ సలామ్’ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్యాత్మిక పర్యటన పెట్టుకున్నట్టు తెలిసింది.