CM Revanth Reddy : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో గజ్వేల్ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల తుంటి శస్త్ర చికిత్స జరిగిన ఆయన చేతి కర్ర సహాయంతో తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ అసెంబ్లీ వద్ద కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ఆయనని అసెంబ్లీలోకి ఆహ్వనించారు. ఇక అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కెసిఆర్ తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గం నుండి మూడు సార్లు జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కెసిఆర్, రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన నిర్వహించారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా, శాసనసభా పక్ష నేతగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషించబోతున్నారు. కేసీఆర్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రమాణం చేయించారు. అనంతరం అసెంబ్లీ లాబీల్లో పార్టీ నేతలందరినీ కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేసీఆర్ బంజారాహిల్స్ నందినగర్ నివాసానికి వెళ్లారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి భోజనం చేశారు. అనంతరం అందరితో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తదితర అంశాలపై చర్చించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన అసెంబ్లీ గేట్ నెంబర్ వన్ ద్వారా రాకపోకలు సాగించారు. అయితే రీసెంట్‌గా మాత్రం కేసీఆర్ గేట్ నెంబర్ 2 ద్వారా ఆయన అసెంబ్లీకి రావడం గమనార్హం. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా ఆయన ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేసి, శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆయన ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై దృష్టిపెట్టాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం. ఇచ్చిన హామీలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీల అమలుకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడం పెద్ద టాస్క్ అని పేర్కొన్నారు. రాబోయే 4-5 నెలలు వేచి చూడాలని, కాంగ్రెస్ తన కార్యాచరణను ఎలా అమలు చేస్తుందో చూసి ప్రజాక్షేత్రంలో వారి డొల్లతనాన్ని బయటపెట్టాలని సూచించారు.