Raghurama Krishnam Raju : వైసీపీ నుంచి గెలిచి ఆరునెలలకే ఆ పార్టీతో విభేదించి ఢిల్లీకే పరిమితమైన రెబెల్ ఎంపీ రఘురామరాజు కొన్నాళ్లుగా ఢిల్లీకే పరిమితం అయ్యారు. అక్కడ నుండే ఆయన రాజకీయం నడుపుతున్నారు. అయితే రీసెంట్‌గా ఆయన ఏపీలో అడుగుపెట్టారు. నాలుగేళ్ల విరామం తర్వాత రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం రోడ్డు మార్గంలో స్వస్ధలం భీమవరం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ స్ధాయికి చేరడానికి కారణమైన సీఎం జగన్ కు ఆయన థ్యాంక్స్ చెప్పారు. గతంలో పెండింగ్ లో ఉన్న కేసుల్లో పోలీసులు తనను అరెస్టు చేసే ప్రమాదం ఉందని ఊహించి హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు పోలీసులకు నిబంధనల మేరకు వ్యవహరించాలని పక్కాగా ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎంపీకి ఇవ్వాల్సిన భద్రత కల్పించాలని ఆదేశించింది. దీంతో రఘురామ ఎంట్రీకి ఆటంకాలు తొలిగాయి. అయినా రాజమండ్రి ఎయిర్ పోర్టులో రఘురామ ఎంట్రీ ఇచ్చే వరకూ ఉత్కంఠ కొనసాగింది. రఘురామరాజు ఎయిర్ పోర్టు నుంచి బయిటికి రాగానే ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే రఘురామ ఎలాంటి ఆటంకాలు లేకుండా బయటికి రావడం, ఆయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలకడం జరిగిపోయాయి.
ఈ సందర్భంగా తనకు ఈ నాలుగేళ్ల పాటు మద్దతు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్, పవన్ తో పాటు తనను ఈ స్ధాయికి తీసుకొచ్చినందుకు జగన్ కు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. భోగినాడు సొంత నియోజక వర్గంలోకి వచ్చిన రఘురామ తొడ కూడా కొట్టారు. చాలా మంది బౌన్సర్స్ నడుమ ఆయన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సారి ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది.