LPG Gas Cylinder : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలతో ప్రజలని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉజ్వల యోజన పథకం కింద పేదలకు వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుండడం మనం చూస్తున్నాం. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఎల్పీజీ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీని మరో 8 నెలల పాటు పొడిగించింది. పథకం లబ్ధిదారులకు ప్రతి సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ లభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎల్‌పీజీ సిలిండర్ సాధారణ కస్టమర్లకు రూ.855కు లభిస్తుండగా, ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.300 సబ్సిడీ ఇవ్వనుంది. అంటే సిలిండర్ వారికి రూ.555కే లభిస్తోంది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వలన లబ్ధిదారులకు వచ్చే ఎనిమిది నెలలు (2025 మార్చి) వరకు ప్రతి నెల 300 రూపాయల సబ్సిడీ వస్తుంది. అలా వారికి 8 నెలలకి మొత్తం రూ. 2400 అకౌంట్లో డబ్బులు పడనున్నాయ్. వీరికి ఏడాదికి 12 రీఫిల్స్ (సిలిండర్లను) సరఫరా చేస్తారు. ఈ పథకం కింద 14.2 కిలోల సిలిండర్‌పై మాత్రమే కేంద్ర ప్రభుత్వం రూ.300 సబ్సిడీ ఇస్తోంది. ఆగస్టు నుంచి భారత్‌లో గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్యాస్ సిలిండర్ల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిబంధనలను జారీ చేసింది.
దీని ప్రకారం కేవైసీ లేకుండా గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతే కాకుండా ఇంట్లో సిలిండర్‌ను పంపిణీ చేసేటప్పుడు వినియోగదారుల బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయాలని కూడా పేర్కొంది. ఎల్‌పీజీ సిలిండర్ల డోర్-స్టెప్ డెలివరీ వ్యక్తులు మీ బయోమెట్రిక్‌లను తనిఖీ చేస్తారు. ఆధార్ వివరాలు మీవేనా అని తనిఖీ చేస్తారు. ఫలితంగా 80% ఉద్యోగులకు బయోమెట్రిక్ ప్రమాణీకరణ పరికరాలు అందించారు. అంతే కాకుండా ఆధార్ కేవైసీ చేయకుంటే గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించింది. కట్టెల పొయ్యి బాధ నుంచి మహిళల ఆరోగ్యం కాపాడటం, పరిశుభ్రమైన వంట వైపు పేద కుటంబాలను తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.