మనిషి శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన అవయవం అని చెప్పవచ్చు. మన శరీర బరువు మెదడు కేవలం 2 శాతమే. అయినా ఇది చాలా ప్రత్యేకమైన పనులు చేస్తుంది. ప్రతి మనిషికి ఉండే జ్ఞాపకశక్తి, ధారణ శక్తి, మేథాశక్తి వంటివన్నీ మెదడుపైనే ఆధారపడి ఉంటాయి. కనుక మెదడు చాలా ప్రత్యేకమైందని చెప్పవచ్చు. కాబట్టే మైండ్‌ను ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంచుకోవాలి. అందుకు గాను ఈ పనులు చేయాల్సి ఉంటుంది. అవేమిటంటే..
మనం ఏదైనా చదవాలనుకున్నప్పుడు దానిని శ్రద్ధతో పఠించడంవల్ల మెదడులో అభిజ్ఞా సామర్థ్యాలు పెరుగుతాయి. మెదడును ఉత్తేజపరుస్తాయి. అంతేకాక రక్త ప్రసరణ అనాసక్త భాగాలలో విరివిగా జరిగి జ్ఞాపకశక్తి మెరుగవుతుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో తేలింది. కానీ ఇది కేవలం పఠనం వల్లనే సాధ్యమవుతుందట. ఆటల ద్వారా, టీవీ వీక్షణం వల్ల కాదట. కనుక పుస్తకాలను ఎక్కువగా చదివితే మెదడును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.
ఇక డ్రాయింగ్ వల్ల కూడా మెదడు పనితీరు మెరుగవుతుంది. ఇటీవల జరిగిన ఒక సర్వేలో 62 -70 సంవత్సరాల వయో వృద్దులలో పెయింటింగ్, ఆర్ట్స్ విభాగాలలో పనిచేయిస్తే పెయింటింగ్ వర్గం వారి మెదడు పనితీరు మెరుగ్గా ఉందని తేలింది. అందువల్ల పెయింటింగ్ లేదా డ్రాయింగ్ వేయడం వల్ల కూడా మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెప్పవచ్చు.
ఇక మనం తినే ఆహరంలో ఉండే గ్లూకోజ్ మన జ్ఞాపకశక్తిని, సాధనా శక్తిని తగ్గిస్తుంది. దీనికి కారణం చక్కెరలు మెదడులోని నాడీవ్యవస్థను బలహీన పరుస్తాయి. అంతేగాక బయట దొరికే శీతల పానీయాలు, స్వీట్లలోనూ గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటే మెదడు నిస్తేజంగా మారుతుంది. కాబట్టి వీటిని మానేస్తేనే మంచిది. తద్వారా మెదడును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.
చివరిగా.. మన మెదడు యాక్టివ్‌గా పనిచేయాలంటే మనం నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే తలనొప్పి వస్తుంది. దీంతో మెదడు సరిగ్గా పనిచేయదు. కనుక రోజూ నీళ్లను బాగా తాగాలి. ఈ విధంగా జాగ్రత్తలు పాటించడం వల్ల మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తుంది. వయస్సు మీద పడినా మతిమరుపు సమస్య రాకుండా చూసుకోవచ్చు.