Kodali Nani : ఏపీలో రాజకీయ వాతావరణం చాలా వేడెక్కిపోతుంది. ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. నందమూరి కుటుంబంలో బాలయ్య వర్సస్ జూఎన్టీఆర్ వివాదం ముదురుతోంది. కొంత కాలంగా టీడీపీ, జూ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కనిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ వర్దంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరోసారి బాలయ్య అక్కడ జూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలిగించాలని ఆదేశించటం మరో వివాదానికి కారణమైంది. ఈ వివాదంపైన మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ కామెంట్స్ చేసారు వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెయ్యి మంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినవారు ఆయన వర్ధంతిని చేయడం ఏమిటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబును రారమ్మని పిలుస్తోందని అన్నారు. తన కొడుకునే సీఎం చేయాలనేదే చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కన పెట్టేసిన నేతలే చంద్రబాబును కలుస్తున్నారని అన్నారు.
ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు వేకువజామున నివాళి అర్పించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. అక్కడ జూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసిన ఆయన వెంటనే వాటిని తొలిగించాలని ఆదేశించారు.ఈ క్రమంలోనే కొడాలి నాని ఘాటుగా స్పందించారు.ఎన్టీఆర్ వర్దంతి నాడు నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి తెర మీదకు రావటంతో దీని పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.