Karivepaku Pachadi : కరివేపాకును మనం ప్రతిరోజూ వంటల్లో వాడుతూ ఉంటాం. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో, గాయాలను తగ్గించడంలో కరివేపాకు సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, జ్ఞాపకశక్తిని, కంటి చూపును మెరుగుపరచడంలో కరివేపాకు ఎంతగానో ఉపయోడపడుతుంది. కరివేపాకుతో మనం కారం పొడిలను కూడా తయారు చేస్తూ ఉంటాం. కరివేపాకుతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినప పప్పు – 3 టీ స్పూన్స్, ఎండు మిర్చి – 8, కరివేపాకు ఆకులు – ఒక కప్పు, బెల్లం తురుము – 2 టీ స్పూన్స్, చింతపండు – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, నీళ్లు – అర కప్పు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒ కటేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్.
కరివేపాకు పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగాక ధనియాలు, జీలకర్ర, మినప పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు ఆకులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక జార్ లో వీటితోపాటు బెల్లం తురుము, ఉప్పు, చింతపండును వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత నీళ్లను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి తాళింపు పదార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా తాళింపు చేసుకున్న తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ పచ్చడిని చిన్న మంటపై వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. అన్నం, నెయ్యితో ఈ పచ్చడిని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అన్నంలో మొదటి ముద్దగా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.