Gautami : ఒకప్పటి అందాల తార నటి గౌతమి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషలలో తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. తమిళ సినిమాలు చేస్తూనే అపుడపుడు తన మాతృ భాష తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా అలరించింది. విశాఖలో గీతమ్ యూనివర్సిటీలో చదువుకునేటపుడే తన కసిన్ నిర్మించే ‘దయామయుడు’ చిత్రంతో నటిగా పరిచయమైన గౌతమి అనంతరం రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘గాంధీనగర్ రెండో వీధి’ సినిమాలో కథానాయికగా నటించింది. అదే యేడాది కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
గౌతమి తెలుగులో కొన్ని సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేసింది. ‘బజారు రౌడీ’, ’తోడళ్లుల్లు’,‘ఆగష్టు 15 రాత్రి’, ప్రచండ భారతం’, ‘కృష్ణ గారి అబ్బాయి, ‘అన్నా తమ్ముడు’, ‘అగ్గిరాముడు’, బామ్మ మాట బంగారు బాట’, చైతన్య, ‘డియర్ బ్రదర్’ వంటి తెలుగు సినిమాల్లో నటించి అలరించింది. 80వ దశకం చివరలో తెలుగు సినిమాకి పరిచయమైన గౌతమి, గ్లామరస్ కథానాయికగా మంచి మార్కులను కొట్టేసింది. అప్పటి స్టార్ హీరోలు అయిన వెంకటేశ్ .. నాగార్జున వంటి స్టార్స్ జోడీగా తెరపై సందడి చేశారు. అయితే చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో ఒక్క మూవీ చేయలేదు.
తాజా ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ .. “చిరంజీవిగారు .. బాలకృష్ణగారి సినిమాల నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి. అయితే నా డేట్స్ కుదరకపోవడం వలన, ఆ ఇద్దరితో చేయలేకపోయాను. సినిమాల దిశగా మా పేరెంట్స్ నన్ను ప్రోత్సహించారు. కానీ నేను చెప్పకుండానే మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్లింది అని అన్నారు. ఇక 80వ దశకానికి సంబంధించిన హీరోయిన్స్ టీమ్ ప్రతి ఏడాది కలుస్తుంటారు. ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానిస్తూనే ఉంటారు. అయితే నిజానికి వాళ్లంతా నా సీనియర్స్ కాబట్టి వాళ్లంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అలాంటివారితో నేను చనువుగా మసలుకోలేను. అందువల్లనే నేను వెళ్లడం లేదు అని చెప్పుకొచ్చింది గౌతమి.