CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను ప్రారంభించిన సీఎం.. మరో 178.63 ఎకరాల్లో సిద్ధం చేసిన 7,728 మందికి ఇళ్ల పట్టాలు, కడుతున్న 4,500 ఇళ్లకు పట్టాలను పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. టిడ్కో ఇళ్లను జగన్ ప్రభుత్వం కేవలం రూపాయికే అన్ని హక్కులతో అందజేస్తోంది. ప్రతి లబ్ధిదారునికి రూ. 7లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చామన్నారు సీఎం జగన్. ఇక గుడివాడలో పేదలకు చంద్రబాబు ఒక్క సెంటు స్థలం, ఇళ్లు కానీ ఇవ్వలేదని.. ప్రభుత్వం నిర్మిస్తుంది జగనన్న కాలనీలు కాదు.. ఊర్లన్నారు సీఎం.
అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామన్న హామీని నెరవేర్చామని.. జగనన్న కాలనీల్లో 16,240 కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయన్నారు. గుడివాడ నియోజకవర్గంలోనే 13,140 మందికి ఇళ్ల పట్టాలిచ్చినట్లు తెలిపారు.అయితే జగన్‌కి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. జగన్‌పై పూల వర్షం కురిపించారు. తనపై పూల వర్షం కురిపించిన వారికి నవ్వుతూ ధన్యవాదాలు తెలియజేశారు జగన్. ఇక గుడివాడ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.
గుడివాడలో టిడ్కో ఇళ్ల పరిశీలనకు వస్తున్న సందర్భంగా లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. గుడివాడలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో సీఎం దిగుతుండగా మహిళలు నిరసన తెలియజేశారు. గో బ్యాక్ సైకో సీఎం అంటూ నల్ల బెలూన్లను మహిళలు వదిలారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. అయితే వారు పోలీసుల వలయాన్ని చేధించుకుని మరీ మహిళలు టిడ్కో ప్రాంగణంలోని హెలిపాడ్ వద్ద నిరసనకు దిగారు. తొలగించిన 1600 మంది టిడ్కో లబ్ధిదారులకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మౌలిక వసతులు కూడా లేకుండా సీఎం ప్రారంభించిన ఇళ్లలో ఎలా నివాసం ఉంటారని మహిళలు ప్రశ్నించారు.