Kodali Nani : ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా పలు ప్రాంతాలు చుట్టేస్తున్న పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. దీంతో సమయం దొరికినప్పుడల్లా వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పేర్నినాని చెప్పులు చూపిస్తూ పవన్ పై ఘాటు విమర్శలు చేశారు. జగన్ కూడా ప్యాకేజ్ స్టార్ అంటూ మరోసారి పవన్‌ని విమర్శించారు. ఇక కొడాలి నాని అయితే ఇద్దరు హీరొయిన్స్ ని పోలుస్తూ పవన్‌పై విమర్శల వర్షం గుప్పించారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ…మహారాష్ట్రలో నవనీత్ కౌర్, కర్ణాటకలో సుమలత ఇండిపెండెంట్లుగా గెలిచారు కానీ ఈ పవర్ స్టార్ మాత్రం గెలవలేకపోయారని సెటైర్లు వేశారు.
గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఆయన ఈ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి అని కొడాలి నాని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారా అని ఆయన ప్రశ్నించారు.. నవనీత్ కౌర్, సుమలత ఇద్దరూ సినీ హీరోయిన్లని.. ఈ ఇద్దరూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎంపీలు అయ్యారని తెలిపారు. అయితే 16 పార్టీలతో పొత్తులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఏం సాధించారని ప్రశ్నించారు.
![Kodali Nani : ఆ ఇద్దరు హీరోయిన్స్ కన్నా కూడా పవన్ అద్వాన్నం అంటూ కొడాలి నాని కౌంటర్ Kodali Nani counter to pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2023/06/kodali-nani.jpg)
చంద్రబాబు కోరిక ప్రతిపక్ష నేతగా ఉండటమని.. పవన్ కళ్యాణ్ కోరిక ఎమ్మెల్యే కావటమని.. దీని కోసం ఈ ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేగలిగే ధైర్యం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరికీ లేదని కొడాలి నాని పేర్కొన్నారు. . గుడివాడలోని టిడ్కో గృహాల సముదాయం ప్రాంగణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం జగన్.ఆ సభలోనే కొడాలి నాని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై దారుణమైన విమర్శలు చేశారు. ప్రస్తుతం కొడాలి నాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.