BRS First List : బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ విడుదల.. 115 సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్లీ సీట్ ఇచ్చిన కేసీఆర్
BRS First List : గత కొన్ని రోజులు అందరిలో అనేక చర్చలు సాగగా, ఆ ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా ఏకంగా 115 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మెజారిటీ సిట్టింగ్ అభ్యర్థులను కొనసాగిస్తుండగా, కొన్ని స్థానాల్లో మాత్రం పలు మార్పులు చేశారు. ఇంకొన్ని స్థానాల్లో పార్టీకి ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం చెప్పుకొచ్చారు. ఈ సారి సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తుండగా.. ఎప్పటిలాగే సిద్దిపేట నుంచి హరీశ్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేయనున్నారు. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్, వేములవాడ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్లు పెండింగ్‌లో పెట్టారు.
వేములవాడలో చెన్నమనేని పౌరసత్వ వివాదం నడుస్తోందని.. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేకపోతున్నామన్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి అయినా సరే నిరాకరించటం తప్పటం లేదన్నారు. వేములవాడ టికెట్ చల్మెడ లక్ష్మీనరసింహకు కేటాయించామన్నారు. హుజూరాబాద్ టికెట్ పాడి కౌశిక్ రెడ్డికి ఇచ్చామన్నారు. దుబ్బాక నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారన్నారు. టికెట్ రానంత మాత్రాన హడావుడి పడి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని.. పార్టీ మారకుండా అభ్యర్థులను గెలిపించుకోవాలని నేతలకు సూచించారు.