YS Sharmila : ఏపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా, ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా అటు కూటమి నేతలు, ఇటు షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్ ఏపీ ప్రజలను మోసం చేశారని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరంలో పర్యటించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి మద్యం వ్యాపారంలో బాగా సంపాదించారని విమర్శించారు. నాసిరకం మద్యం విక్రయించడం ద్వారా పేద ప్రజల జీవితాలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. జగన్ ప్రభుత్వం ఒక చేత్తో మట్టిం చెంబు ఇష్తూ.. మరో చేత్తో వెండి చెంబు లాగేసుకుంటుందని విమర్శించారు.
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విజయవాడలో బస్సు యాత్ర చేస్తుండగా జగన్‌పై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు రాయి తాకింది. అయితే సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో సీఎం జగన్ పక్కనే ఉన్న ఎంఎల్ఏ వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం అయ్యింది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు డాక్టర్లు. అయితే సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే.. టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు సోదరుడు, సీఎం జగన్‌పై దాడి ఘటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని షర్మిల ట్వీట్ చేశారు.