Chandra Babu : ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మూడు పార్టీల తరపున సింహ గర్జన మొదలైంది. పవన్, చంద్రబాబు పదునైన స్పీచ్‌తో అదరగొడుతున్నారు. ప్రజాగళం వినిపిస్తాం. నిడదవోలు జన వారాహిని చూస్తే జగన్ రెడ్డికి నిద్రపట్టక గుండె పగిలిపోవడం ఖాయం. జగన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి నిడదవోలు ప్రజలు సిద్దంగా ఉన్నారు. కూటమిని అడ్డుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే తొక్కుకుంటూ పోతాం’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కు చెందిన వారాహి వాహనం పైనుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “గత 40 ఏళ్లలో నిడదవోలుకు అనేక పర్యాయాలు వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రజల ఉత్సాహం చూస్తుంటే మే 13న గెలవబోయేది ఎన్డీయే అని స్పష్టమవుతోంది.
మొట్ట మొదటిసారిగా మూడు పార్టీల అధ్యక్షులం ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఇక్కడికి వచ్చాం. వారాహి నుంచి ప్రజాగళం వినిపిస్తున్నాం. మిత్రుడు పవన్ కల్యాణ్ వారాహి గురించి చెబుతుంటే విన్నాను కానీ, ఇవాళే చూస్తున్నాను. ఇక్కడ్నించి మూడు పార్టీల తరఫున సింహ గర్జన చేస్తున్నాం. ప్రజాగళాన్ని వినిపిస్తున్నాం. ఇప్పుడే తణుకులో నేను, పవన్ కల్యాణ్ గారు రోడ్ షో చేశాం… అదిరిపోయింది. ఇప్పుడు నిడదవోలు దద్దరిల్లిపోయింది. ఇది చూస్తే జగన్ కు నిద్ర రాదు… గుండె పగలిపోవడం ఖాయం. సినిమాల్లో పవర్ స్టార్ గా ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్… నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, భారత్ ను ప్రపంచపటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న మోదీ ఉన్నారు… నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు చెప్పండి… మనకు జగన్ ఓ లెక్కా?
జగన్ మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం సిద్ధం అని తిరుగుతున్నాడు… నిడదవోలు నుంచి చెబుతున్నాం… నిన్ను ఓడించడానికి మేం సిద్ధం. మమ్మల్ని అడ్డుకోవాలంటే నీ వల్ల కాదు… సైకిల్ స్పీడు పెంచి తొక్కుకుంటూ ముందుకెళతాం. పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరింత పదునెక్కుతుంది… నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుందే తప్ప, నీ బురద అంటదు. ఈ మూడు కలిసిన తర్వాత ఇక అన్ స్టాపబుల్. మేం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఈ ఆటుపోట్లు మాకు కొత్త కాదు… మేం రాటుదేలిపోయాం. కానీ పవన్ కు ఇలాంటి పరిస్థితులు అలవాటు లేకపోయినా నిలదొక్కుకున్నారు. మావి మూడు జెండాలు… కానీ అజెండా ఒక్కటే. సీట్ల సర్దుబాటుతో అనేక త్యాగాలు చేసి మీ వద్దకు వచ్చాం. నిండు మనసుతో ఆశీర్వదించండి అని అన్నారు.