ప్రముఖ హీరో శరత్ కుమార్ తనయ వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషలలో కూడా ఈ అమ్మడు సత్తా చూపుతుంది. రీసెంట్‌గా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నటించగా, ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటించగా, బాలయ్య చెల్లెలు భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించింది. నెగెటివ్ షేడ్స్ తో ఆమె పాత్ర ఉండగా, ఆమె పాత్రపై ప్రశంసల వర్షం కురిసింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఆమె ఆసక్తికరంగా మాట్లాడారు.
“ఈ సినిమాను నేను చూశాను .. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ చూసి షాక్ అయ్యాను. ఆ ఫైట్స్ చూస్తూ జై బాలయ్య .. జై బాలయ్య అని అరిచి గొంతు పోయింది. తమన్ సార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఈ సినిమానే లేదు. ప్రతి షాట్ లోను నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమా తరువాత నేను బాలయ్యకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను” అన్నారు. ఇక “భానుమతి పాత్ర ఇంతగొప్పగా డిజైన్ చేసిన గోపీచంద్ మలినేనిగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇంట్రవెల్ బ్లాక్ లో నేను బాలయ్య బాబును పొడిచేసే సీన్ చూసి .. ఆయన అభిమానులు నన్ను చంపేస్తారేమోనని భయపడ్డాను. ఆ విషయంలో బాలయ్య బాబు నాకు ధైర్యం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్స్” అంటూ చెప్పుకొచ్చారు.
భిన్నమైన పాత్రల్లో నటిస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.