Telangana Bhavan : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మ్యాజిక్ ఫిగర్‌ని దాటి సరికొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో స్ట్రాంగ్‌గా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి నోట మాట రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం తెలంగాణ భవన్‌లో నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఉమ్మడి రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాలు మినహా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీచడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు నీరసించిపోయారు. ఓటమి తర్వాత అక్కడ ఉన్న నాయకులంతా ఒక్కొక్కరుగా మెల్లగా జారుకున్నారు.
అయితే కేటీఆర్ మాత్రం ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి తెలంగాణ భవన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని, అందుకే ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా, మన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారన్నారు. ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు. ఎన్నికల తర్వాత ప్రజల నుంచి మన పార్టీ నాయకత్వంపైన ఒక సానుకూల స్పందన వస్తుందన్నారు.
![Telangana Bhavan : వెలవెలబోయిన తెలంగాణ భవన్.. బాధతో బయటకు వచ్చేసిన కవిత.. Telangana Bhavan situation after brs party loss](http://3.0.182.119/wp-content/uploads/2023/12/telangana-bhavan.jpg)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 39 స్థానాలు లభించాయి. కొన్నిచోట్ల స్వల్ప తేడాతో అభ్యర్థులు ఓడిపోయారు. మరికొన్ని చోట్ల ముక్కోణ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు వెనకపడ్డారు. ఈ ఓటమితో తాము కుంగిపోవట్లేదని.. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు కేటీఆర్. రెండుసార్లు తమకు ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకోసమే తాము పనిచేస్తామన్నారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేల సమావేశం అనంతరం.. నేతలంతా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లినట్టు సమాచారం. కేసీఆర్ తో వారు సమావేశం అయ్యారని, భవిష్యత్ కార్యాచరణ.. ప్రతిపక్ష పాత్రలో ఎలా ఉండాలనే విషయంపై కేసీఆర్, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసారని అంటున్నారు.