Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టారు. పవన్ పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా కూడా అధికారంలోకి రాలేకపోతున్నారు. దీంతో ఈ సారి తప్పక గెలవాలని పవన్ భావిస్తున్నాడు. తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో బీజేపీతో కలిసి తెలంగాణాలోనూ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ, అలాగే మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగించిన జనసేనాని మళ్ళీ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చెయ్యనున్నారు. ఏపీలోనూ త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తగిలిన దెబ్బ ఈ ఎన్నికల్లో తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
2024 ఎన్నికల్లో పొత్తులను ముందే ప్రకటించిన పవన్ కళ్యాణ్ టీడీపీ తో కలిసి ప్రయాణం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ మంత్రులు, నేతలు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నిత్యం టార్గెట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ మాత్రం వెనకడుగు వెయ్యటం లేదు.ఈసారి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించటం టార్గెట్ గా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రీసెంట్‌గా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నికలకు పార్టీ నాయకులను, కేడర్ ను సమాయత్తం చెయ్యటంతో పాటు, క్షేత్ర స్థాయిలో టీడీపీతో సమన్వయం చేసుకోవటంపై ప్రధానంగా చర్చించారు పవన్.
![Pawan Kalyan : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ Pawan Kalyan sensational comments on ex cbi jd laxmi narayana](http://3.0.182.119/wp-content/uploads/2023/12/pawan-kalyan-1.jpg)
తాజాగా ఆయన మీటింగ్‌లో మాట్లాడుతూ… పార్టీ నుండి వెళ్లిపోయిన చాలా మందికి ఓపిక లేదు. వారికి చెప్పాలని అనుకున్నాను. వినేవాళ్లకి మనం చెబుతాం కాని, చెవుల్లో సీసం పోసుకున్నవాళ్లకి మనం చెప్పలేం. అందుకే వాళ్లకి నేను ఏం చెప్పలేదు. ఇప్పటికైన పార్టీ నుండి ఎవరైన వెళ్లిపోతానంటే వారిని నేను ఆపను. నాకు ప్రజలు ముఖ్యం. నా భావనని అర్ధం చేసుకున్న నాయకులు ఉంటే నేను ఎదైన చేయగలను. ఎలక్షన్ కి ఎంపీగా నిలబడిన వారికి టికెట్స్ ఇచ్చాం , బీఫాంలు ఇచ్చాం. వారు నాపైన ఆజమాయిషీ చేయాలని చూశారు. పెట్టుబడి పెట్టింది నేను, నిలబడింది నేను, దెబ్బలు తింది నేను. నా పైన ఆధిపత్యం చేయాలని చూస్తే ఎలా ఊరుకుంటాను. ఎన్ని దెబ్బలు తిన్నా కూడా ప్రజల కోసం పని చేస్తానని పవన్ అన్నాడు.