T20 World Cup 2022 : ఆస్ట్రేలియా వేదికగా అడిలైడ్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ కష్టం మీద విజయం సాధించింది. వరుణుడు అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్‌లు రాణించారు. 44 బంతులు ఆడిన కోహ్లి 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అలాగే కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహముద్ 3, షకిబ్ అల్ హసన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మొదటి 6 ఓవర్ల వరకు దూకుడుగా ఆడింది. వారి ఆటను చూస్తే భారత్ ఓడిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ వర్షం పడింది. దీంతో ఓవర్లను కుదించారు. బంగ్లా టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 గా నిర్దేశించారు.
అయితే వర్షం అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడలేకపోయారు. భారత బౌలర్లు విజృంభించడంతో వికెట్లను సమర్పించుకున్నారు. కానీ చివరి ఓవర్లలో బ్యాట్స్ మెన్ భారత ప్లేయర్లను టెన్షన్ పెట్టించారు. వరుసగా వికెట్లు పడుతున్నా బౌండరీలు సాధించారు. అయితే మ్యాచ్ చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. అయినప్పటికీ పరుగులను సాధించడంలో బంగ్లా వెనుకబడింది. దీంతో ఆ జట్టు 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో బంగ్లాపై భారత్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇక భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. అలాగే మహమ్మద్ షమీకి 1 వికెట్ దక్కింది. అయితే మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు బంగ్లాదేశ్ జట్టు బౌండరీలను సాధిస్తూనే ఉంది. దీంతో తీవ్ర ఉత్కంఠ కలిగింది. ఒక దశలో బంగ్లాదేశ్ గెలుస్తుందేమో.. భారత్ ఇంటికేనని అనుకున్నారు. కానీ ఎట్టకేలకు చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేతో ఆడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 6వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది.