ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీ 20 వరల్డ్ కప్ పోరు రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. చిన్న జట్లు కూడా పెద్ద జట్లకి కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. ఈ రోజు నెదర్లాండ్స్ టీం.. సౌతాఫ్రికా లాంటి టీంని ఓడించి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఆ మధ్య జింబాబ్వే.. పాక్‌కి షాకిచ్చింది. సిరీస్ ఇంత రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో ఓ శ్రీలంక క్రికెటర్ యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడనే వార్త టీ 20 వరల్డ్ కప్‌లో కలకలం రేపింది. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ధనుష్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేయడంతో ధనుష్క లేకుండానే శ్రీలంక టీం ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి పయనమైంది.
టీ20 వరల్డ్ కప్ కోసం ధనుష్క ఇటీవల ఆస్ట్రేలియాకి రాగా, ఆయన వరల్డ్ కప్ మధ్యలోనే గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే సిడ్నిలోని ఓ హోటల్లో ఉంటున్నాడు. ఆ సమయంలోనే అక్కడే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఓ యువతి ధనుష్కపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సిడ్ని పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ధనుష్క గుణతిలక అరెస్ట్ వ్యవహారంపై న్యూ సౌత్ వేల్స్ పోలీసులు స్పందించారు. తమ అధికారిక వెబ్‌సైట్‌లో క్రికెటర్ అరెస్ట్ విషయాన్ని స్పందించింది. రోస్ బే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువతిపై నవంబర్ 2న క్రికెటర్ అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ధనుష్కను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ తరుణంలోనే శ్రీలంక జట్టు… ధనుష్క గుణ తిలకను అక్కడే వదిలేసి స్వదేశానికి పయనమయింది. ఆదివారం ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓటమితో శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరచి ట్రోఫీ దక్కించుకున్న ఈ టీం వరల్డ్ కప్‌కి వచ్చేసరికి మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.