Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు అరెస్ట్ ఏపీలో ఎంత రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నాయకులతో పాటు పలువురు బీజేపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు.. చంద్రబాబు అరెస్టు వెనక వైసీపీ ఎలాంటి కుట్రకూ పాల్పడలేదన్న ఆయన.. దర్యాప్తు ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడిపై బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ పోలీసులు ఇవాళ ఉదయం నంద్యాలలో ఆయన్ని అరెస్టు చేశారని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ వెనక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని సజ్జల అన్నారు. చంద్రబాబు హయాంలోనే ఈ స్కాం జరిగిందన్న సజ్జల, దీనిపై ఆయన ఎందుకు నిస్పక్షపాత దర్యాప్తు జరిపించలేదని నిలదీశారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో బోగస్ కంపెనీలను సృష్టించి ప్రజా సొమ్మును అక్రమ మార్గాల్లో దోచుకున్నారని అన్నారు. రెండేళ్ల కిందటే CID దీనిపై కేసు నమోదు చేసిందని వివరించారు. ఎఫ్ఐఆర్‌లో తన పేరులు లేదని చంద్రబాబు అనడాన్ని సజ్జల తప్పుపట్టారు. ఎఎఫ్ఐఆర్‌లో అన్నీ ఉండాలని లేదన్న ఆయన.. చంద్రబాబు.. దబాయిస్తున్నారని అన్నారు. 2017, 2018లోనే పూణెలో జీఎస్డీ విచారణలో షెల్ కంపెనీలకు మనీ మళ్లించినట్లు అధికారులు అప్పుడే గుర్తించారని అన్నారు.

స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందనేందుకు బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు తాము నమ్ముతున్నామని సజ్జల అన్నారు. నిజానిజాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పిన సజ్జల ప్రజలను చంద్రబాబు తప్పుదారి పట్టించాలని చూసినా, నిజాలు ప్రజలకు తెలుస్తాయి అన్నారు.రాత్రికి రాత్రి సీఐడీ వెళ్లి అరెస్ట్ చేయలేదని.. స్కామ్‌పై రెండేళ్ల విచారణ జరిపి ఆధారాలతోనే అరెస్ట్ చేసిందని తెలిపారు. అసలు విషయం చెప్పకుండా టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు సజ్జల.