Chandra Babu : ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఏపీ రణరంగంగా మారింది. నంద్యాలలో ఉన్న చంద్రబాబు బస చేసిన క్యాంపు వద్దకు పోలీసులు అర్ద్రరాత్రి తరువాత చేరుకున్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు కారణాలు ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. దీంతో అరెస్ట్ కు సంబంధించిన పేపర్లను..వివరాలను అందించిన పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సరైన నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్న పురంధీశ్వరి… FIRలో పేరు లేకుండా, ఎలాంటి వివరణా తీసుకోకుండా ఏ విధంగా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ వార్తలతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా కలకలం రేగింది. చంద్రబాబును అరెస్ట్ చేసి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్ళాలని పోలీసులు యత్నిస్తున్నారు. అక్కడ హెలికాప్టర్‌ను పోలీసులు సిద్ధంగా ఉంచారు. అక్కడి నుంచి విజయవాడకి తరలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైళ్ళను పోలీసులు నంద్యాల తీసుకువెళ్లారు. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొంతమందికి కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఇదే కేసులో ఒక ఆడిటర్‌ను సీఐడీ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో ఏదైనా స్టేట్‌మెంట్ ఇపపించారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలతో.. ఏపీ సీఐడీ పోలీసులు ఇవాళ ఉదయం 5 గంటలకు చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల తర్వాత చంద్రబాబు అరెస్టు పేపర్లపై సంతకం పెట్టారు. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. పక్కా స్కెచ్‌తోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని అంటున్నారు.