సినిమా రంగంలో ఉన్నవారంతా ఆస్కార్ అవార్డ్ గురించి ఎంతగా కలలుకంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్కార్ అనేది తెలుగు సినీ పరిశ్రమకు అందని ద్రాక్షగానే మిగిలింది . అయితే గత ఏడాది కాలంలో, దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆస్కార్ ఫీవర్ పెరిగిందనడంలో సందేహం లేదు. ఈ ఘనత ‘ఆర్ఆర్ఆర్’ మూవీకే దక్కుతుంది. ఆర్ఆర్ఆర్ విడుదలై బాక్సాఫీస్ హిట్ కొట్టిన దగ్గర నుంచి ఈ సినిమా ఆస్కార్‌కు వెళుతుందన్న ప్రచారం మొదలైంది. అందుకు కారణం ఈ సినిమాను మెచ్చుకుంటూ హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ట్వీట్లు చేయడంతో దేశంలో ఆస్కార్ జపం మొదలైంది.
పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ నామినేషన్‌ను దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ అవార్డును కైవసం చేసుకుంది. అయితే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్‌కి అంత ఈజీగా రాలేదు. ఆర్ఆర్ఆర్ ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చు చేశారట. ఈ నామినేషన్స్ కొరకు దాదాపుగా 100 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్క్రీన్సులో స్క్రీనింగ్, గెస్టులకు పిఆర్ మెయింటెన్ మొదలుకొని ప్రతి విషయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. అయితే ‘కాంతారా’, ‘విక్రాంత్ రోణ’, ‘గంగూభాయ్’, ‘మి వసంతరావ్’, ‘రాకెట్రీ’, ‘తుజ్యా సాథీ కహీ హై’, ‘ఇరవిన్ నిళల్’ సినిమాలు 2023 ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి సొంతంగా బరిలోకి దిగాయి. అయితే, ఇవేవీ ఏ విభాగంలోనూ నామినేట్ అవ్వలేదు. మామూలుగా ఒక సినిమా విడుదల చేసేముందు మార్కెటింగ్ ఎలా చేస్తారో, అలాగే ఆస్కార్ నామినేషన్లకు కూడా మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది.