Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. పవన్ ఈ సారి పదవి దక్కించుకోవాలన ఎంతో కృషి చేస్తున్నారు.ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తన ఒక్కడి ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేది. కానీ, తనకు పదవులు ముఖ్యం కాదన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా దశాబ్దకాలంపాటు పార్టీని నడపడం అంత సులభం కాదు.
అయినా సరే మీ భవిష్యత్తు బాగుండాలనే ఆకాంక్షతోనే పనిచేస్తున్నా. ఈరోజు ఎక్కడికి వెళ్లినా తనకు అశేష ప్రజాభిమానం ఉందన్నారు. ఇంత ప్రజాభిమానాన్ని తమ పార్టీకే సొంతం చేసుకోవాలన్న స్వార్థం ఉంటుందన్నారు. కానీ, స్వార్థాన్ని దాటి మీకోసం వచ్చానని తెలిపారు.. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా దశాబ్ద కాలం పార్టీని నడపగలిగానంటే… రాష్ట్ర భవిష్యత్తు కోసమేనన్నారు. తనకు పదవులు కావాలంటే ఎప్పుడో ప్రధాని మోదీని అడిగి తెచ్చుకునే వాడినన్నారు. అమ్మ ఒడి పథకానికి ఎలా కోతలు విధించారో పవన్ తెలిపారు. ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. రూ.15 వేలు ఇస్తామని చివరికి రూ.13 వేలకు కుదించారన్నారు. ఒక చేత్తో అమ్మ ఒడి ఇస్తూ మరో చేత్తో లాగేసుకునేవారన్నారు. సీఎం జగన్ ఓ సారా వ్యాపారి అని విమర్శలు చేశారు. కేవలం 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలకే పరిమితం అయ్యామంటే అది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే అన్నారు.

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం రావాలంటే ఒక్క తప్పు కూడా జరగకూడదన్నారు పవన్ కళ్యాణ్. అన్ని శక్తులు కలవాలన్నారు. అందుకే 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకున్నామని పవన్ వివరించారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేనది అయినప్పటికీ కేంద్ర నాయకత్వం అభ్యర్థన మేరకు వదులుకోవాల్సి వచ్చిందన్నారు. మంత్రి అమర్నాథ్ పై పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తొస్తుంది కానీ, ఇప్పుడు అనకాపల్లి కోడి గుడ్డు పేరు వింటున్నాం. కోడి గుడ్డు పెట్టింది. ఇంకా పొదుగుతూనే ఉంది. వైసీపీ కోడి. ఈ జిల్లాకు ఒక డిప్యూటీ సీఎంను, ఐదు పోర్టుఫోలియోలకు మంత్రిని, ఒక విప్ ను ఇచ్చింది. కానీ, ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేకపోయింది అంటూ మంత్రి అమర్నాథ్ ను ఉద్దేశించి పవన్ సెటైర్లు వేశారు. మరోవైపు, జగన్ ఒక సీఎం కాదు.. సారా వ్యాపారి, ఇసుక దోపిడీ దారు అని పవన్ విమర్శించారు.