Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్ధతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన జనసేన విస్తతస్ధాయి భేటీ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుసగా వారాహి యాత్రతో పాటు షూటింగ్స్ తోనూ బిజీగా గడుపుతున్న పవన్ కు అస్సలు విశ్రాంతి లేకుండాపోయింది. దీంతో తాజాగా వెన్నునొప్పితో కూడా బాధపడ్డారు. ఈ మధ్యే కృష్ణాజిల్లాలో వారాహి నాలుగోదశ యాత్రను ముగించుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన కీలక నేతలతో భేటీ అయ్యారు.
టీడీపీతో కలిసి వెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ కోసం ఐదుగురు నేతలతో కమిటీని కూడా ప్రకటించారు. దీనిపై తదుపరి చర్చలు రేపు నిర్వహించాల్సి ఉంది.అంతలోనే పవన్ అస్వస్ధతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ బారిన పడటంతో హైదరాబాద్ వెళ్లి అక్కడే చికిత్స చేయించుకున్నారు. పీవర్ తగ్గగానే తిరిగి మంగళగిరి చేరుకున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, వారాహి విజయయాత్ర ఐదో విడత, జనసేన,తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అంశాలు, రాష్ట్రంలో రైతాంగం సమస్యలపై చర్చించినట్టు సమాచారం.

మరోవైపు.. పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్రకు లాంగ్ బ్రేక్ ప్రకటించారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి నేపథ్యంలో.. పవన్ యాత్రకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో.. పవన్ తన ఫ్యామిలీతో కలిసి అక్టోబర్ 17న ఫారిన్‌కు పయనం కానున్నట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత మళ్లీ 26న తిరిగి రానున్నట్టు సమాచారం. కాగా.. ఫారిన్‌కు వెళ్లే ముందే.. పార్టీ కార్యక్రమాలు అన్ని చక్కబెట్టాలని బిజీ షెడ్యూల్ వేసుకున్న పవన్‌కు.. సడెన్‌గా వైరల్ ఫీవర్ రావటంతో.. అన్ని కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది.