Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి తరపున శాసనసభాపక్షనేతగా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబును కూటమి తరపున సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా .. ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ మహోత్తర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా అతిరథ మహారథులు తరలి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు మోత మోగించారు.
సాధారణంగా పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ అయినా.. సక్సెస్ మీట్ అయినా.. పవన్ వచ్చినా.. రాకపోయినా.. ఆయన అభిమానులు మాత్రం అస్సలు తగ్గరు. వచ్చిన దగ్గరనుంచి ఈవెంట్ అయ్యేవరకు.. పవన్ పవన్ అంటూ.. నినాదాలు చేస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో.. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం స్వీకారం చేస్తే ఎలా ఉంటుంది. ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ ఫ్యాన్స్ తో పాటు జనసేన నాయకులు, టీడీపీ నేతలు కూడా తోడయ్యారు. మరి ఇలాంటి సమయంలో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. ఒక్కసారిగా బాహుబలి సీన్ రిపీట్ అయ్యింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ మహిష్మతి సామాజ్య సర్వ సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు.. మహిష్మతి ప్రజలు ఏ విధంగా ఉద్వేగానికి గురయ్యారో.. ఆ సామాజ్యాన్ని , మహిష్మతి పీఠాన్ని కదిలించిన సన్నివేశం ఆ సినిమాకే హైలేట్‌గా నిలిచింది.
ఇప్పుడు అదేసీన్ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో రిపీట్ అయ్యింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవర్ స్టార్ ప్రమాణ స్వీకారం చేయగానే.. వేదిక.. ప్రాంగణం అంతా.. ఒక్కసారిగా కేరింతలతో దద్దరిల్లింది. టీడీపీ నాయకులు సైతం లేచి చేతులు ఊపుతూ… సందడి చేశారు. పవన్ ప్రమాణ స్వీకారానికి సభా ప్రాంగణంలో వచ్చిన రెస్పాన్స్ చూసి అక్కడికి వచ్చిన వేరే రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఇవాళ నెరవేరింది అంటూ పోస్టులు చేస్తున్నారు.