Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసుతం గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూనే వైసీపీ ప్రభుత్వం లోపాలని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓవైపు విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు తనను సీఎం చేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కాకినాడలోకి ప్రవేశించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉదయం స్ధానికంగా నగర ప్రముఖులతో పాటు మేథావులతో భేటీ అయ్యారు. వారితో తాజా పరిస్ధితులపై చర్చించారు. అనంతరం జనసేన ప్రభుత్వం ఏర్పాటు, అధికారం చేపట్టాక తన అజెండా ఎలా ఉంటుందన్న దానిపై వారికి వివరించారు.
జనవాణి కార్యక్రమంలో ఓ దివ్యాంగుడి పరిస్థితి గురించి తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమకు పెన్షన్ అందడం లేదని, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఓ దివ్యాంగుడు, మహిళ చెప్పారు. జనవాణి కార్యక్రమంలో మత్స్యకారులు కూడా పాల్గొని తమ సమస్యలు చెప్పుకున్నారు. దేవాలయ భూములను పోర్ట్ కోసం అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీసుకున్నారంటూ మత్స్యకారులు చెప్పారు. అర్చకులకు రూ.5 వేల గౌరవ వేతనం అని వైసీపీ ప్రభుత్వం చెప్పిందని, అవి ఎలా సరిపోతాయని పలువురు అర్చకులు పవన్ తో అన్నారు.
జనవాణి కార్యక్రమంలో పలువురు క్రైస్తవ ప్రభోదకులు మాట్లాడుతూ… వైసీపీ సర్కారు క్రైస్తవులకు ఏ విధమైన న్యాయం చేయలేదని అన్నారు. రెల్లి కులస్తులు కూడా తమ బాధలు చెప్పుకున్నారు. భార్య భర్తలు వచ్చి తమ బాధలని పవన్‌తో చెప్పుకున్నారు. అంతే కాదు తను 7వ తరగతి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని, తన భర్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినందుకే పెళ్లి చేసుకున్నట్టు తెలియజేశారు. అలానే వారి గ్రామ దేవత పూజ చేయించిన కండువాని పవన్ మెడలో వేసారు భార్య భర్తలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
https://youtube.com/watch?v=7WmDgGmjYm8