Pawan Kalyan : తెలంగాణ ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇస్తూ పలు ప్రాంతాలలో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా తాండూర్ పట్టణంకి వెళ్లారు. ఆయన రాకతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. ఎక్కడ చూసినా అభిమానులతో జనసేన, బిజెపి కార్యకర్తలతో నిండిపోయింది. పవన్ కళ్యాణ ప్రసంగం ఉద్వేగ భరితంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాదేండ్ల మనోహర్. నాగర్ కర్నూల్ అభ్యర్థి లక్ష్మణ్ గౌడ్, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్, బీజేపీ నాయకులు పటేల్ జయశ్రీ, యు. రమేష్ కుమార్, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ. “అన్యాయం జరిగినప్పుడు తిరగబడాలని, అవినీతి జరిగినప్పుడు ప్రశ్నించాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీతో పొత్తు చేసుకున్న జనసేన అభ్యర్థుల గెలుపుకు అందరు సహకరించాలని” కోరారు.
అయితే పవన్ రాకతో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆయనవైపుకి దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారి పరిస్థితి దారుణంగా మారింది. పోలీసులు వారిని కంట్రోల్ చేయడం కొంత ఇబ్బందిగా మారింది. తాండూరులో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి అందరు షాకయ్యారు. అధికారం, ఆర్థిక వనరులు తెలంగాణలో అన్ని వర్గాలకు సమానంగా అందాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణలో సామాజిక న్యాయం ఎంతో అవసరం. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామని, అదే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరికీ అధికారం అందినపుడే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది” అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ రాకతో తాండూరులో అభిమానులు భారీగా తరలివచ్చారు. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ అని.. ఇక్కడ ప్రతి అణువులోనూ ఆశయం దాగి ఉంటుందన్నారు. దేనికీ భయపడకుండా.. కష్టానికి వెరవకుండా ముందుకు సాగే యువత తెలంగాణలోనే ఉందన్నారు. ఈ నేల, గాలి ఇచ్చిన ధైర్యంతోనే రాజకీయాల్లో ముందడుగు వేయగలుగుతున్నానని అన్నారు. తనకు పదవులు మీద ఆశ, అధికారం మీద ప్రేమ అనేవి లేవని.. తనకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ ప్రస్థానంలో 31 మంది బీసీ వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రులుగా చేశారని.. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ పాలనలో దేశం ముందుకు దూసుకువెళ్తోందన్నారు.