Mokshagna : నందమూరి ఫ్యామిలీ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అతని ఆకారం చూసి ఇప్పట్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండకపోవచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాని పలు ఇంటర్వ్యూల్లో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ కోసం కథలు వింటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తన దర్శకత్వంలో రూపొందబోతున్న ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
గత కొంత కాలంగా నందమూరి మోక్షజ్ఞ యొక్క లుక్ ఎలా ఉంది అనేది దానిపై క్లారిటీ లేదు. పాత ఫొటోలే అప్పుడప్పుడు వైరల్ అవుతుండగా, ఆయన ఎప్పుడు సన్నబడతాడా అని ప్రతి ఒక్కరు ముచ్చటించుకోసాగారు. అయితే ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో క్లారిటీ వచ్చింది. ఇటీవల గుండెపోటుకు గురై మృతి చెందిన నందమూరి తారకరత్న యొక్క పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు గాను మోక్షజ్ఞ అక్కడికి చేరుకోగా, ఆయన కొద్దిగా సన్నబడి ఉండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నందమూరి మోక్షజ్ఞ ఇప్పుడు హీరో మాదిరిగా తయారు అయ్యాడు అని ముచ్చటించుకున్నారు.
నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మోక్షజ్ఞ యొక్క కొత్త విజువల్స్ ను షేర్ చేస్తూ తెగ సంతోషిస్తున్నారు. తారకరత్న మృతి నేపథ్యం లో కుటుంబం మొత్తం దుఃఖం లో ఉండగా.. ఫ్యాన్స్ మాత్రం ఈ సమయంలో మోక్షజ్ఞ యొక్క లుక్ గురించి మాట్లాడుకోవడం కాస్త విడ్డూరంగా ఉందనే చెప్పాలి. ఇక తారకరత్న విషయానికి వస్తే నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కుప్పకూలిపోయిన ఆయన 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఫిబ్రవరి 18న కన్నుమూసారు.