Minister KTR : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ దేశ వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో తెలంగాణ ఎన్నికల్లొ అక్కడ సెటిలైన సీమాంధ్ర ఓటర్ల మద్దతు గురించి స్పష్టత ఇచ్చారు కేటీఆర్. సీఎం జగన్ తో పాటుగా టీడీపీ నేతలతో ఉన్న సంబంధాల గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. తెలుగుదేశం కు కీలక సూచన చేసారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీకి సంబంధించినదని, తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అరెస్ట్ కు నిరసనగా ఇక్కడ ర్యాలీలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహాంలో తమ పార్టీ తటస్ఠంగా ఉందని తెలిపారు.
చంద్రబాబు అరెస్టుతో మాకేం సంబంధం? ఆంధ్రప్రదేశ్ లో ఒకరితో ఒకరు తలపడండి. అంతేకాని హైదరాబాద్ లో ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు. సున్నితమైన విషయాలను సెన్సిటివ్ గానే హేండిల్ చేయాలి. ఏపీలో ఏమైనా చేసుకోవచ్చు. ఆ రెండు పార్టీలకు ఇక్కడ స్థానం లేదు. హైదరాబాద్ లో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదనే ర్యాలీలను అనుమతించడం లేదు. హైదరాబాద్ లో ర్యాలీలకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని అడిగారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమని చెప్పాను. జగన్, పవన్, లోకేశ్ నాకు దోస్తులే. ఏపీ ప్రజలు ఇక్కడ బాగానే వున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఐటీ కారిడార్ ర్యాలీలు జరగలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఐటీ పరిశ్రమకు ఇబ్బంది కలుగుతుంది.
టీడీపీ నేతలు ఏపీలో రాజకీయ పోరాటం చేస్తున్నారని..ఇకే సమయంలో ఎంత మందితో గొడవ పెట్టుకుంటారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తమ పైన సానుభూతితో ఉన్నవారిని వదిలేసుకుంటారా అని వ్యాఖ్యానించారు. తమకు టీడీపీలోని పలువురితో సత్సంబంధాలు ఉన్నాయని..సీఎం జగన్, పవన్, లోకేశ్ తోనూ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని వివరించారు.