Kalvakuntla Kavitha : రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగా అరెస్టు చేయించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అయితే కవితను అరెస్ట్ చేసిన ఈడీ రాత్రికి రాత్రి ఢిల్లీ తీసుకెళ్లారు. రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కల్వకుంట్ల కవితను ప్రవేశపెట్టారు. కవితకు రిమాండ్ విధించింది. ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీకి తరలించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ అధికారుల కస్టడీలో ఉండాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కవిత అరెస్ట్‌పై ఆరోపించారు. ఆయన కొడంగల్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంలేదని, ఉన్నత న్యాయ స్థానంలో కేసు పెండింగ్‌లో ఉండగానే ఇలాంటి చర్యలకు పాల్పడం అప్రజాస్వామికం అన్నారు. ఎమ్మెల్సీ కవితను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దౌల్తాబాద్ ఎంపీపీ విజయ్‌కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విత అరెస్టుతో అత్యవసర విచారణ కోరనున్నారు ఆమె లాయర్లు. దీంతో పాటు అరెస్ట్ పై కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించనున్నారు. ఓ వైపు తన కేసు సుప్రీంకోర్టులో నడుస్తుండగానే తనను అక్రమంగా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారంటూ కవిత తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టు మెట్లెక్కనున్నారు. మరి ఈ కేసులో ముందు ముందు ఏం జరగబోతుంది? కవితకు బెయిల్ వస్తుందా ? రాదా ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు కేటీఆర్, కవిత భర్త, పలువురు సన్నిహితులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది.