Jagapathibabu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు జగ్గూభాయ్. ఆయన కీలక పాత్రలో నటించిన రామబాణం ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జగపతిబాబు.. గోపీచంద్ కు అన్నగా నటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లతో చిత్ర బృందం వరుసగా ఇంటర్వ్యూలిస్తూ ఉన్న నేపథ్యంలో జగ్గూభాయ్ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. సినిమాకు సంబంధించిన విషయాలనే కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా ఆయన పంచుకుంటున్నారు.
ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలలో రజనీకాంత్ పాల్గొనడం, ఆ వేదిక మీద చంద్రబాబు మీద పొగడ్తల వర్షం కురిపించడమే ఆయన చేసిన పాపం అయ్యింది. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన రజనీకాంత్ మీద ప్రస్తుతం ఏపీలోని అధికార వైఎస్సాఆర్సీపీ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరూ విమర్శలతో దాడి చేస్తున్నా… తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరూ ఆయనకు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు. తొలిసారి రజనీకి బాసటగా జగపతిబాబు స్పందించారు. రజనీకాంత్ చక్కగా మాట్లాడతారని, నిజాలే మాట్లాడతారని జగ్గూబాయ్ అన్నారు.
”రజనీకాంత్ 100% రైట్! అయితే, ఇప్పుడు జరిగినది, లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి నేను వినలేదు. కానీ, ఆయన మాట్లాడే విధానం, తీరు పర్ఫెక్ట్ గా ఉంటుంది” అని జగపతి బాబు సమాధానం ఇచ్చారు. ఆయన చక్కగా మాట్లాడతాడు.. నిజాయితీగా మాట్లాడతాడు.. నిజాలు మాట్లాడతాడు అని చెప్పుకొచ్చాడు. మాట్లాడేవాళ్లు మాట్లాడుకొంటూనే ఉంటారు… అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘కథానాయకుడు’ సినిమాలో తొలిసారి రజని, జగపతి బాబు కలిసి నటించారు. ఆ తర్వాత ‘లింగా’, ‘అన్నయ్య’ సినిమాల్లో జగపతి బాబు విలన్ రోల్స్ చేశారు.