Iratta Movie Review : ఇటీవల ఓటీటీలో వస్తున్న చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఇరట్టా అనే చిత్రం మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించి ఇప్పుడు తెలుగులో డబ్ జరుపుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ ఏంటనేది చూస్తే.. కేరళలోని వాగమన్ అనే ఊరిలోని పోలీస్ స్టేషన్ లో చిన్న ఈవెంట్ జరుగుతూ ఉండగా, అక్కడికి అటవీశాఖా మంత్రి వస్తున్నారని తెలిసి హంగామా నడుస్తుంటుంది. మరికాసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది అనేసరికి.. స్టేషన్ లో గన్ కాల్పులు వినిపిస్తాయి. లోపలికి వెళ్లి చూస్తే ASI వినోద్(జోజూ జార్జ్) చనిపోయి ఉంటాడు. ఆ సమయంలో లోపల ముగ్గురు పొలీసులు ఉంటారు.
వినోద్‌ని చంపింది ఆ పోలీసులేనా, లేకుంటే వేరే కారణాల వలన అతను చనిపోయాడా అనేది ఇరట్టా చిత్రం చూస్తే తెలుస్తుంది. ఇరట్టా అంటే మలయాళంలో ఇద్దరు, డబుల్ అని అర్థం. ఇప్పటివరకు మీరు ఎన్నో థ్రిల్లర్స్ చూసి ఉండొచ్చు కానీ ‘ఇరట్టా’ మాత్రం ప్రత్యేకం అని చెప్పాలి. ఒక్కో లేయర్ విడిపోతున్నకొద్ది ప్రతి ఒక్కరిపైనా సందేహం వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో అతడి చావుకు గల కారణాన్ని రివీల్ చేసుకుంటూ వెళ్లడం ఆకట్టుకుంటుంది. చివరకు వినోద్ ని అతడి సోదరుడు ప్రమోద్ చంపినట్లుగా అనుమానపడటం లాంటివి సినిమాని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేశాయి. చిత్రానికి క్లైమాక్స్ మాత్రం వేరే లెవల్ ఉంటుంది.
ఇక ఎప్పుడైతే తమ్ముడి మరణాన్ని ఇన్వెస్టిగేట్ చేసేందుకు డీఎస్పీ ప్రమోద్ రంగంలోకి దిగుతాడో.. స్టోరీ జెట్ స్పీడులో దూసుకెళ్తుంది. ఓ పోలీస్, అది కూడా స్టేషన్ లోనే ప్రజల సమక్షంలోనే చనిపోవడం అనే పాయింట్ ని చాలా ఉత్కంఠభరితంగా తీయడాన్ని కచ్చితంగా మెచ్చుకుని తీరాలి. నటన విషయానికి వస్తే జోజూ జార్జ్ రెండు డిఫరెంట్ పాత్రలని మడిచి అదరగొట్టేశాడు. అంత అద్భుతంగా నటించాడు. డీఎస్పీ ప్రమోద్ పాత్రలో కూల్ గా, వినోద్ పాత్రలో రఫ్ గా తన అనుభవాన్ని అంతా ఉపయోగించి స్టోరీని వేరే లెవల్‌కి తీసుకెళ్లాడు. అక్కడక్కడ బోరింగ్ సీన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తప్ప సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.