Nagarjuna : గత పదేళ్లుగా ఎన్ కన్వెన్షన్ వివాదం కాకరేపుతున్న విషయం తెలిసిందే. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెరువుని ఆక్రమించి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నిర్మించారని ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ కన్వెన్షన్ ని నేలమట్టం చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎన్ కన్వెన్షన్ విలువ ఎంత.. నాగార్జునకి దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది. కూల్చేయడం వల్ల ఎంత నష్టం లాంటి అంశాలు వైరల్ అవుతున్నాయి. వినిపిస్తున్న అంచనా ప్రకారం ఎన్ కన్వెన్షన్ మొత్తం విలువ 400 కోట్లు అని తెలుస్తోంది.
ఈ ఫంక్షన్ హాల్ ని ఉపయోగించుకోవడానికి కోట్లల్లో ఖర్చు అవుతుందట. ఈ ఫంక్షన్ హాల్ నుంచి ప్రతి ఏడాది నాగార్జునకి 100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని టాక్. కూల్చివేత వల్ల వందల కోట్లల్లో నష్టం వాటిల్లిందని అంటున్నారు. నాగార్జున ప్రస్తుతం హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కూల్చివేత చట్ట విరుద్ధం అని అన్నారు. మరి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున కోర్టులో ఎలా పోరాడతారు.. నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. తుమ్మిడి కుంట చెరువులో కొన్ని ఎకరాలని అక్రమంగా ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. తుమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రా గుర్తించింది.
అక్రమ కట్టడం క్రింద ఆ భవనాన్ని కూల్చివేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై నాగార్జున సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు.