Ramiz Raja : ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు పరిస్థితి దారుణంగా మారింది. చిన్న చిన్న జట్లపై కూడా ఓడిపోతూ పరువు పోగొట్టుకుంటుంది. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మంచి జరగడం లేదు. గతేడాదిలో పాక్ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడితే, వన్డే ప్రపంచ కప్ 2023లో లీగ్ దశ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే, టీ 20 ప్రపంచ కప్ 2024లో గ్రూప్ దశను దాటి ముందుకు సాగలేకపోయింది. టెస్టు క్రికెట్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉన్న జట్టు తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ చెత్త ప్రదర్శన తర్వాత పాకిస్థాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన తాజా పాయింట్ల పట్టికను ఐసీసీ విడుదల చేయగా, ఇందులో పాకిస్తాన్ 8వ స్థానానికి చేరుకుంది. అంటే, ఇప్పుడు వెస్టిండీస్ జట్టు మాత్రమే పాకిస్థాన్ కంటే తక్కువగా ఉంది. బంగ్లాదేశ్ చేతిలో తమ జట్టు ఓటమికి భారత్ పరోక్ష కారణమని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమిజ్ రజా ఆరోపించాడు. ఆసియా కప్‌లో తమ ఫాస్ట్ బౌలర్లను భారత బ్యాటర్లు దీటుగా ఎదుర్కొన్న అనంతరం తమ జట్టు పతనం మొదలైందని తెలిపాడు. రావల్పండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌కు ఊహించని పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. బంగ్లా చేతిలో ఓటమికి తమ జట్టు పేలవ ప్రదర్శన, వ్యూహాలతో పాటు భారత్ కూడా కారణమని రమిజ్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ జట్టు ఎంపికలో లోపాలు ఉన్నాయి. స్పిన్నర్ లేకుండా నలుగురు సీమర్లతో బరిలోకి దిగడం పేలవమైన వ్యూహం.
”అయితే మా పేసర్లపై ఉన్న గొప్ప కీర్తి క్రమంగా తగ్గుతోంది. ఆసియా కప్‌లో పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై మా ఫాస్ట్ బౌలర్లను భారత్ దీటుగా ఎదుర్కొంటూ ఆధిపత్యం చెలాయించడంతో ఇది మొదలైంది. అప్పటి నుంచి మా రహస్యాలు ప్రపంచానికి తెలిశాయి. ఇతర జట్లు మాపై కౌంటర్ ఎటాక్ ఇస్తున్నాయి. మరోవైపు మా బౌలర్ల వేగం తగ్గుతూ నైపుణ్యాలపై ప్రభావం పడుతోంది. ఇక మా ఫాస్ట్ బౌలర్ల కంటే బంగ్లాదేశ్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు” అని రమిజ్ రజా పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171*), సౌద్ షకీల్ (141) సెంచరీలతో సత్తాచాటారు. షోరిఫుల్, హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. నసీమ్ షా మూడు వికెట్లు తీశాడు. కాగా, 117 పరుగుల వెనుకంజతో బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 146 స్కోరే సాధించింది. అనంతరం 30 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.