Harish Rao : తెలంగాణ, ఏపీ రాజకీయాలు ఎంత వాడివేడిగా మారుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఒకే రాష్ట్రంలోని నేతలపై విమర్శలు చేయడమే కాకుండా పక్క రాష్ట్రాల వారిపై కూడా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొందరు నేతలు ఆయనకి సపోర్ట్ చేస్తూ జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలోనే మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళైతే సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర విమర్శలే చేశారు. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలకు వైసీపీ నేతలలో కనీస చలనం లేదు.
బీఆర్ఎస్ ముఖ్యనేత, మంత్రి హరీష్ రావు మొదట నుండి చంద్రబాబు నాయుడు అరెస్టును తప్పు పడుతూ ఉండగా, ఆయన ఇది బీజేపీ, వైసీపీల కుట్ర అని అంటున్నారు. తాజాగా హరీష్ రావు చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అసలు పనితనం లేదు.. కేవలం పగతనం మాత్రమే ఉంది అంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా కేసీఆర్ పగబడితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలులో ఉండేవారని.. కానీ తాము ఎవరి మీదా పగ పట్టమని, అలాగే ఎవరి మీద అకారణమైన ద్వేషాన్ని పెంచుకోమని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఏపీలో కక్ష రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం జైలులో పెట్టడం ముమ్మాటికి తప్పని అంటున్నారు హరీష్ రావు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో పనితనం లేదని.. పగతనం మాత్రమే ఉందని హరీష్ రావు విస్పష్టంగా చెప్పారు.ఆయన వ్యాఖలు ఇప్పుడు రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఐదేళ్ల తమ పాలనలో రేవంత్ రెడ్డిని కట్టడి చేయలేకపోయామన్న ఆవేదన హరీష్ రావు మాటలలో కనిపిస్తున్నదని కొందరి అంటుంటే.. ఇందులో వేరేది దాగి ఉందని కొందరు అంటున్నారు. ఇక ఆర్థిక మంత్రిగా కంటే.. ఆరోగ్య మంత్రిగా ఉండటమే ఇష్టం.. ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవ చేయడం ఇష్టం.. అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. పోలిటిషియన్ గా తనకు ఆరోగ్య మంత్రి అంటేనే ఇష్టమని.. ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంటే.. చాలా మందికి దూరమవుతాం.. చాలా కోరికలు ఉంటాయి.. కానీ అవి చేయలేము.. అంటూ పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే.. ఏ మంత్రి కోరుకుంటారని ప్రశ్నించగా.. సీఎం కేసీఆర్ ఏది ఇస్తే.. అదేనంటూ స్పష్టంచేశారు.