Wasim Akram : ప్రస్తుతం భారత్ వేదికగా వరల్డ్ కప్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. భాగంగా చెన్నై వేదికగా అప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. పసికూనగా భావించే అప్ఘాన్ జట్టు.. 8 వికెట్ల తేడాతో తన పొరుగు దేశాన్ని చిత్తుగా ఓడించింది. చెపాక్ లాంటి కఠినమైన పిచ్ మీద 283 పరుగుల లక్ష్యా్ని సునాయాసంగా చేధించింది. లక్ష్య చేధనలో ఏ దశలోనూ అప్ఘానిస్థాన్ తడబడినట్టు కనిపించలేదు. పాకిస్థాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చెత్త ఫీల్డింగ్‌తో పాటు పేలవ బౌలింగ్‌తో 283 పరుగుల భారీ లక్ష్యాన్ని బాబర్ సేన కాపాడుకోలేకపోయింది. పాకిస్థాన్ ఘోర పరాజయంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఇప్పటికే షోయబ్ అక్తర్ తమ జట్టుపై నిప్పులు చెరగగా.. వసీం అక్రమ్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అప్ఘానిస్థాన్ చేతిలో తమ జట్టు చిత్తుగా ఓడిపోవడంతో.. పాకిస్థాన్ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇండియా చేతిలో ఓడినప్పుడు సాకులు చెప్పారు.. మరి ఇప్పుడేం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. బాబర్ ఆజమ్ కెప్టెన్సీపైనా ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ అయితే ఓ అడుగు ముందుకేసి పాక్ క్రికెటర్ల తిండి అలవాట్లను ప్రశ్నిస్తూ దుమ్మెత్తి పోసాడు . 280కిపైగా పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేధించడం అనేది చాలా పెద్ద విషయం. పిచ్ తడిగా ఉందా లేదా అనేది పక్కనబెడితే.. ఓసారి మనోళ్ల ఫీల్డింగ్ చూడండి.. ఫిట్‌నెస్ స్థాయిలు ఎలా ఉన్నాయో చూడండి’’ అంటూ ఓ పాకిస్థాన్ టీవీ షోలో అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పాక్ ఆటగాళ్లెవరికీ రెండేళ్లుగా ఎలాంటి ఫిట్‌నెస్ టెస్టులను చేయలేదని మనం గత మూడు వారాలుగా మొత్తుకుంటున్నాం. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడితే.. ముఖాలు వాడిపోతాయి. వీళ్లను చూస్తుంటే.. ప్రతి రోజూ 8 కిలోల మటన్ తింటున్నట్టు కనిపిస్తున్నారు. వీళ్లకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించొద్దా..? అని అక్రమ్ ప్రశ్నించాడు. ఆయన చేసిన కామెంట్స్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.