Sr NTR : నందమూరి తారక రామారావు.. ఈ పేరుకి ఓ చరిత్ర ఉంది.. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఈయన దూరమై 26 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1977.. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం. ఆయన పని అయిపోయింది అనుకున్న వాళ్లకు తాను మనసు పెట్టి సినిమాలు చేస్తే ఎలాంటివి వస్తాయో అని చూపించాడు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన దానవీరశూరకర్ణ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్. ఈ విజయం గురించి మరచిపోకముందే అదే యేడాది ఏప్రిల్ 28న అడవి రాముడు విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది.
అదే ఏడాది చివర్లో అక్టోబర్ 21న యమగోల విడుదలైంది. ఇది సూపర్ హిట్. 1977లో మొత్తం ఆరు సినిమాల్లో నటిస్తే.. అందులో మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన చరిత్ర అన్నగారికి తప్ప మరొకరికి లేదు. అయితే అన్నగారు ఎంత పద్దతిగా ఉండే వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలినాళ్లలో పేకేటి శివరాం, కస్తూరి శివరావు.. వంటివారు. మహ జల్సా రాయుళ్లుగా పేరు తెచ్చుకున్నారు. వారు ఖర్చు చేయడమే కాక పక్కన ఉన్న వారితో కూడా ఖర్చు చేయిస్తారట. అందుకే వారికి కాస్త దూరంగా ఉండే వారట అన్నగారు.
సినిమాలు చేస్తూ కొంచెం కొంచెం సంపాదించిన ఎన్టీఆర్ నిమ్మకూరులో పొలాలు కొన్నారు. ఎక్కిడికైనా వెళ్లాల్సి వచ్చినా.. అన్నగారు.. ఆచి తూచి అడుగులు వేసేవారట. ఉదయం షూటింగుకు వెళ్లే సమయంలో మాత్రం బస్సును ఆశ్రయించేవారట. సాయంత్రం షూటింగు అయిపోయిన తర్వాత.. మాత్రం.. తన రూంకి నడుచుకుంటూ వెళ్లేవారట. ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ నడక వ్యాయామంగా ఉంటుందని అలానే నడుచుకునే వెళ్లేవారట. ఆయన పాటించిన పొదుపు మంత్రమే ఎన్టీఆర్‌ని ఆ స్థాయిలో నిలబెట్టేలా చేసింది.