Chandra Babu : స్కిల్ కేసులో బెయిల్ పొందిన చంద్రబాబు ప్రస్తుతం హుషారుగా ఉన్నారు. ఢిల్లీ వెళ్లారు. అక్కడ కొంతమంది పెద్దల్ని కలిశారు. ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారా అనే డౌట్ అందరిలో తలెత్తుతుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తనయుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లగా, అక్కడ ఆయనకు పలువురు ఎంపీలు ఘన స్వాగతం పలికారు. . కాగా, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ ఢిల్లీలో చంద్రబాబును కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను రఘురామ ఎక్స్ లో పోస్టు చేశారు. ఢిల్లీలో చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన వెల్లడించారు. ఆ ఫొటోలో చంద్రబాబు… రఘురామ భుజంపై చేయి వేసి చిరునవ్వుతో కనిపించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అంటేనే రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో అనే టెన్షన్ ప్రత్యర్థి పార్టీలకు ఉంటుంది. ఈమధ్యే జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చి.. ఆ తర్వాత స్కిల్ కేసులో బెయిల్ పొందిన చంద్రబాబు.. తన రెగ్యులర్ షెడ్యూల్స్ ఫాలో అవుతున్నారు. తాజాగా ఆయన ఢిల్లీ వెళ్లడం హైలెట్ అయ్యింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా కొడుకు పెళ్లి రిసెప్షన్‌కి చంద్రబాబు ఢిల్లీ వెళ్లగా, ఆయనతోపాటూ.. భార్య నారా భువనేశ్వరి కూడా వెళ్లారు.
సిద్ధార్థ్ లూథ్రా మామూలు లాయర్ కాదు. ఇటీవల స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపున ఆయన వాదించారు. లూథ్రా కొన్నేళ్లుగా చంద్రబాబుకు సన్నిహితులు. వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్లే ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించడంతో చంద్రబాబు… నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో.. కొందరు బీజేపీ పెద్దలను కలుస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగాలని డిసైడ్ అయ్యాయి. ఎటొచ్చీ.. బీజేపీ నుంచే క్లారిటీ లేదు. టీడీపీతో బీజేపీ కలిసేందుకు సిద్ధపడితే.. అది రాజకీయంగా తమకు ప్లస్ అవుతుందని టీడీపీ భావిస్తోంది. అందువల్ల చంద్రబాబు దీనిపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని అనధికారికంగా తెలుస్తోంది. అదే జరిగితే, ఏపీలో పొత్తులపై మరింత స్పష్టత రాగలదు. ఐతే.. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టింది.