AP New Liquor Policy : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. లిక్కర్ పాలసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది. రాష్ట్రంలో 2019 కంటే ముందున్న తరహా విధానాన్నే మళ్లీ తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న విధానాన్ని కొన్ని మార్పులు చేసి ఏపీలో కూడా ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రభుత్వం ప్రైవేటుకే అప్పగించనుంది. ఒక వ్యక్తి నుంచి ఎన్ని షాపులకైనా దరఖాస్తులు స్వీకరించాలని.. వచ్చిన దరఖాస్తులను లాటరీ తీసి లైసెన్సులు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారట.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం విధానం రూపకల్పనకు కేబినెట్ సబ్‌కమిటీ ని ఏర్పాటు చేసింది. ఐదుగురు మంత్రులు కొల్లురవీంద్ర గొట్టిపాటి రవికుమార్, సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ , కొండపల్లి శ్రీనివాస్‌తో కూడిన సబ్‌కమిటీని నియమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానంపై కమిటీ సమీక్షించనుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. వివిధ వర్గాల అభిప్రాయాలు సైతం సేకరించనుంది. ఇప్పటికే అధికారులు ఇచ్చిన నివేదికను సబ్‌కమిటీ పరిశీలించనుంది.

గత వైసీపీ పాలనలో జే బ్రాండ్ పేరిట విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను జరిపిందని, కల్తీ మద్యంను విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి సభ్యులు విస్తృతంగా ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం నూతన మద్యం పాలసీని తీసుకువస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగా ఇప్పటికే అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం మరోమారు మంత్రులతో ఏర్పాటుచేసిన సబ్‌కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది విధానాన్ని ప్రకటించే అవకాశముంది. ఏపీలో మద్యం ధరలు కూడా తెలంగాణ, కర్ణాటకతో సమానంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అప్పుడు సుంకం చెల్లించని మద్యం అరికట్టేందుకు వీలవుతుందని భావిస్తున్నారట. ఏపీలో నూతన మద్యం విధానం రూపకల్పన కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.