Aarambham On OTT : సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక తెలుగు థ్రిల్లర్ మూవీ ఆరంభం ఈ ఏడాది మే 10న ఆడియన్స్ ముందుకు రాగా, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా మూవీ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమాని ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మాణంలో కొత్త దర్శకుడు అజయ్ నాగ్ వి తెరకెక్కించారు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 5 అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
చిత్ర కథ విషయానికి వస్తే.. మిగిల్(మోహన్ భగత్) కి మర్డర్ కేసులో రెండున్నరేళ్లుగా కాలాఘటి జైల్లో ఉంటాడు. చివరికి అతనికి ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష అమలు చేయడానికి ఒక్క రోజే ఉంటుంది. కట్ చేస్తే ఆ జైలు నుంచి మిగిల్ తప్పించుకుంటాడు. అయితే సెల్ తాళాలు వేసినవి వేసినట్టే ఉంటాయి, జైలుకి ఎలాంటి రంధ్రాలు లేవు, పారిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా జైల్లో పటిష్టమైన భద్రత ఉంటుంది. మరి జైలు సెల్ నుంచి మిగిల్ ఎలా తప్పించుకున్నాడనేది పెద్ద మిస్టరీ. ఇది పోలీస్ డిపార్ట్ మెంట్ కి పెద్ద టాస్క్ లా మారుతుంది. ఎలా తప్పించుకున్నాడు, ఎక్కడికి వెళ్లాడు అనేది తెలియదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ సస్పెన్స్ ని చేధించడానికి డిటెక్టివ్(రవీంద్ర విజయ్) రంగంలోకి దిగుతాడు.
మిగిల్ ఉన్న సెల్‌లో ఓ బుక్ దొరుకుతుంది. అందులో మిగిల్ చిన్నప్పుడు పెరిగిన వివరాలు, తన గురువు (భూషణ్) చేస్తున్న డేజావు ప్రయోగాల గురించి ఉంటుంది. మరి మిగిల్ చిన్నప్పటి లైఫ్ ఏంటి? ఎలా పెరిగాడు, తన సర్ ఎవరు? ఆయన చేసే ప్రయోగాలేంటి? ఇంతకి మిగిల్ ఎలా తప్పించుకున్నాడు అనేది `ఆరంభం` సినిమా మిగిలిన కథ. ఆరంభం సినిమా ఓ కన్నడ నవల ఆధారంగా తెరకెక్కింది. సినిమా స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకున్నారు. మొత్తం ఒక కథలా కాకుండా కొన్ని అధ్యాయాలుగా సినిమాని తెరకెక్కించారు. కథ విషయంలో కొన్ని సీన్స్ లో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వక తప్పదు. సినిమా కొద్దిగా స్లోగానే సాగుతుంది. అమ్మ సెంటిమెంట్ మాత్రం బాగా వార్కౌట్ అవుతుంది. అలాగే డెజావు సైన్స్ ఎక్స్‌పరిమెంట్స్ ఆసక్తిగానే సాగుతాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం ఆసక్తిగా అనిపిస్తుంది. సీక్వెల్ కి ఛాన్స్ ఉండేలా క్లైమాక్స్ లో ఓ లీడ్ ఇచ్చారు. మరి సీక్వెల్ ఉంటుందా లేదా చూడాలి.