చికెన్‌తో సహజంగానే చాలా మంది రకరకాల వంటలను తయారు చేస్తుంటారు. చికెన్ కూర, వేపుడు, బిర్యానీ, పులావ్.. ఇలా రకరకాల వంటలను వండుతుంటారు. అయితే చికెన్‌తో మనం స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. వాటిల్లో చికెన్ పకోడీ కూడా ఒకటి. దీన్ని సరిగ్గా చేయాలే కానీ.. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే చల్లని వాతావరణంలో వేడిగా వీటిని తింటే వచ్చే మజాయే వేరు. ఇక చికెన్ పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్‌లెస్ చికెన్ – పావు కేజీ, పుదీన, కొత్తిమీర – కట్ట చొప్పున, పచ్చి మిర్చి – 4, అల్లం – చిన్నముక్క, వెల్లుల్లి – 6 రెబ్బలు, నిమ్మకాయ – 1, ధనియాల పొడి – టీ స్పూన్, పెరుగు – 2 టీస్పూన్లు, శనగపిండి – అర కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపోయినంత.
చికెన్ పకోడీ తయారీ విధానం..
పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నింటినీ తీసుకుని మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి. తరువాత చికెన్‌ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ రసం ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా ముద్ద వేసి బాగా కలపాలి. గంటసేపు అయిన తరువాత ఒక టీస్పూన్ వేడి నూనె, శనగపిండి కలిపి ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి అందులో శనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీల్లా వేయాలి. బంగారు వర్ణంలో వచ్చాక టిష్యూ పేపర్ పరిచిన పళ్లెంలోకి తీసుకుని నిమ్మకాయ ముక్కలు, ఉల్లి చక్రాలతో అలంకరించుకోవాలి. దీంతో వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అవుతుంది. అయితే శనగపిండితోపాటు కొద్దిగా మొక్కజొన్న పిండిని కూడా కొంతమంది కలుపుతారు. దీంతో పకోడీలు కర కరలాడతాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.