Nara Rohit : మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్‌పై తెలుగు తమ్ముళ్లతో పాటు టీడీపీ నాయకులు చాలా ఆగ్రహంగా ఉన్నారు.బాలకృష్ణ అయితే ఓ అడుగు ముందుకు వేసి అన్ని బాధ్యతలని తన నెత్తిపై వేసుకున్నారు. ఇక అదే ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యుల కూడా చంద్రబాబు అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సినీ నటుడు, చంద్రబాబు సోదరుడి కుమారుడైన నారా రోహిత్ ..సోషల్ మీడియా ద్వారా తన పెద్దనాన్న అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
ప్రభుత్వం కక్షపూరితంగానే ఇదంతా చేస్తోందని నారా రోహిత్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. నియంతృత్వం వాస్తవం అయినప్పుడు విప్లవం ఒక హక్కు అవుతుందంటూ విక్టర్ హ్యూగో కొటేషన్‌ని కోట్ చేసారు నారా రోహిత్. అంతే కాదు చంద్రబాబుని అరెస్ట్ చేసినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించారు . తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఈ చర్య కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే. తన రాజకీయ జీవితం అంతా ప్రజా సేవకే అంకితం చేసిన వ్యక్తిపై అవినీతి నిందలు మోపడం బాధను కలిగించింది అని నారా రోహిత్ స్పష్టం చేశారు.
అవినీతి మా రక్తంలో లేదు. దొంగకు పాలన పగ్గాలు ఇస్తే ఎంత విధ్వంసకాండ జరుగుతుందో ఏపీలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక ఇలా దొంగదారిలో పిరికితనంతో వ్యవహరిస్తున్నారు. తమ అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నియంతలు కాల గర్భంలో కలిసిపోక తప్పదు. నింద నిజం కాదు. నిజాన్ని దాచలేరు. ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా గళం విప్పాలి. సత్యమేవ జయతే’’ అని రోహిత్ పేర్కొన్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నందుకు నా పేరు కూడా రిమాండ్ రిపోర్ట్‌లో రాస్తారేమో అంటూ ఆయన పంచ్ వేశారు.