Sanghavi : సంఘవి ఒకప్పుడు టాప్ హీరోయిన్గా సత్తా చాటింది. సింధూరంలో జేడీ చక్రవర్తితో కలిసి నటించిన హీరోయిన్. ఆ తర్వాత.. పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఈ అమ్మడు కర్ణాటకలోని మైసూరులో జన్మించింది. సంఘవి చిన్ననాటి నుంచే మోడలింగ్ చేయటం ప్రారంభించింది. సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది. ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి, సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు. ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది. అప్పుడే సినిమాలలో నటించాలన్న అభిరుచికి బీజం పడింది.
తమిళ సినిమాతో సంఘవి అరంగేట్రం చేసిన సంఘవి తొలి సారి అజిత్ సరసన నటించింది. ఆ సినిమా పేరు అమరావతి. ఇక కృష్ణ వంశీ కంట్లో పడిన సంఘవికి సింధూరం సినిమా పెద్ద మలుపు తీసుకువచ్చింది. ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది. లాహిరి లాహిరి లాహిరిలో, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఆదివారం ఆళ్లవాకు సెలవు.. వంటి సినిమాల్లో నటించి మెప్పించింది సంఘవి. ఆనై అనే తమిళ చిత్రంలో తల్లి పాత్ర పోషించింది. పలు టీవీ సీరియల్స్‌లోనూ సంఘవి నటించడం గమనార్హం. అయితే రీసెంట్గా సంఘవి తన భర్త, కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకుంది. గత నెల ఆమె తిరుమలలో ఒకసారి కనిపించారు. మళ్లీ ఇప్పుడు, ఆ కలియుగ వైకుంఠమైన తిరుమలలోనే తారసపడ్డారు.
స్వామివారి నైవేద్య విరామ సమయంలో సంఘవి తన భర్త వెంకటేష్, కూతురుతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా, వారిని ఫొటోగ్రాఫర్స్ కెమెరాలలో బంధించారు. . స్వామివారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక సంఘవి ఫొటోలకి పోజులు ఇస్తున్న సమయంలో పాపను తీసుకుని ఆమె భర్త వెంకటేష్ పక్కకు వెళ్లబోతే.. పాప మాత్రం అమ్మ దగ్గరే ఉంటానని మారాం చేసింది. దీంతో పాపను ఎత్తుకుని భక్తులతో ఫొటోలు దిగారు సంఘవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.