Meher Ramesh : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రం ఆగస్ట్ 11న గ్రాండ్‌గా విడుదలైంది. చిరంజీవి నటించిన గత చిత్రం వాల్తేరు వీరయ్య మంచి హిట్ కొట్టడంతో భోళా శంకర్ కూడా ప్రేక్షకులని అలరిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కాని చిత్రం దారుణంగా నిరాశపరచింది.చిరంజీవి కెరీర్లోనే పెద్ద డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచిందని అంటున్నారు. పదేళ్ల తర్వాత చిరంజీవి లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ మెహర్ రమేష్‌కి దక్కగా, దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రీమేక్ సినిమాని కూడా చెడగొట్టి మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. కంత్రి, బిల్లా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మార్కులు వేయించుకున్న మెహర్ రమేష్ 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో శక్తి సినిమాను తెరకెక్కించారు.అయితే ఈ సినిమా నిర్మాత అశ్వినీదత్ కు ఏకంగా 22 కోట్ల రూపాయల నష్టం మిగిల్చింది.
జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో శక్తి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవగా, ఈ సినిమాలోని ఎన్టీఆర్ లుక్స్ విషయంలో సైతం విమర్శలు వచ్చాయి.శక్తి సినిమా డిజాస్టర్ అయినా మెహర్ రమేష్ పై నమ్మకంతో విక్టరీ వెంకటేష్ షాడో సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చారు.అయితే ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. భోళా శంకర్ సినిమా కూడా చేదు ఫలితం ఎదురైంది.అనిల్ సుంకర 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఈ సినిమా కోసం ఖర్చు చేయగా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.మెహర్ రమేష్ ను నమ్మడమే హీరోల పాలిట శాపమైందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే సినిమా రిలీజ్ రోజు అభిమానులతో కలిసి థియేటర్లో మూవీని వీక్షించారు మెహర్ రమేష్. కొన్ని సీన్స్ లో ఫ్యాన్స్ రియాక్షన్ చూసి సంతోషపడిన మిగతా సినిమా అంతా కూడా చెత్తగా ఉందని పలువురు కామెంట్స్ చేయడం ఆయనని బాధ పెట్టింది. ఇక అభిమానుల తాకిడి, అలానే కొందరు సినిమాపై నెగెటివ్ గా మాట్లాడడం మెహర్ రమేష్‌కి అస్సలు నచ్చలేదు. కొందరు ప్రేక్షకులు దారుణంగా మాట్లాడడంతో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడని తెలుస్తుంది.