నేటి తరం యువకుల తొందరపాటు పని వారి ప్రాణాల మీదకు తెస్తుంది. ఎంతో మంచి జీవితం ఉండగా, ప్రేమ, దోమ పేరుతో నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో దగ్గరైన ఆ బంధం పలు కారణాల వలన మధ్యలోనే ముగిసిపోతుంది. వారి ప్రమేయం లేకుండానే విధి ఆడే వింత నాటకంలో ప్రాణాలను కోల్పొతున్నారు. ఆ విధంగానే ఒక యువకుడు ప్రియురాలికి పిజ్జా ఇవ్వడానికి వెళ్లి బిల్లింగ్ నాల్గోవ అంతస్తు పైనుంచి పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన 19 ఏళ్ల మహమ్మద్ షోయబ్ అనే యువకుడు తనుండే ప్రాంతంలోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు.అయితే అతడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది.
ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి అతడు తన ప్రియురాలి ఇంటికి పిజ్జా తీసుకుని వెళ్లాడు. షోయబ్ ఇంట్లో ఉన్న సమయంలో యువతి తండ్రి వచ్చాడు. డోర్ కొట్టింది తన ప్రియురాలి తండ్రి అని తెలియగానే షోయబ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. తాను ఇంట్లో ఉన్న సంగతి అతడికి తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుందని అతడు భావించిన అతను విచక్షణ కోల్పోయి నాలుగో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తం మడుగులో పడిఉన్న అతడ్ని స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
పోలీసులకు సైతం ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. షోయబ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు సోమవారం ఉదయం కన్నుమూశాడు. షోయబ్ మరణంపై అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా 17 నుండి 23 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారే ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో బలి అవుతున్నారు. చిన్న వయస్సులో షోయబ్ మృతి చెందడం చాలా మందిని బాధించింది.