Pawan Kalyan : రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ కార్యకర్తలతో భేటి అయిన పవన్ కళ్యాణ్.. పలు అంశాల గురించి చర్చించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని వారితో వ్యాఖ్యానించారు. సామాన్యుడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని వైకాపా భావిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. వైకాపా దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడమే అన్నారు. ఎన్నికల ఏడాదిలో అడుగుపెడుతున్నామని, రాష్ట్రంలో తాజా పరిణామాలతో ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
జనసేన నేతలకు త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కేవలం తన చుట్టూ తిరిగితే నాయకులైపోరంటూ నేతలకు చురకలు అంటించారు పవన్ కళ్యాణ్. డబ్బు ఇచ్చి సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదని, వచ్చే 25 ఏళ్ల గురించి ఆలోచించే నేతలు కావాలన్నారు. భావితరం గురించి ఆలోచించే నేతలు వేరే పార్టీల నుంచి వస్తే ఆహ్వానిస్తానని పవన్ ఆఫర్ ఇచ్చారు. జగన్ అనే ఒక దుష్ట నాయకుడిపై మనం పోరాడాలంటూ వారికి సూచించారు. 2019 ఎన్నికల తరహాలో కాకుండా సర్వే నివేదికలు, అభిప్రాయ సేకరణ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని నేతలకు తెలిపారు. అలాగే ప్రత్యర్ధులు రెచ్చగొట్టారని మీరు రెచ్చిపోవద్దని నేతలకు పవన్ సూచించారు.
మిమ్మల్ని నేను చనిపోమనో లేదంటే డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పడం లేదు. మీ కన్నా ముందు నేను ఫైట్ చేస్తా. నేను పోయాక మీరు ఏం చేస్తారనేది ఆలోచించండి. జనసేనను బాధ్యతగా ఉండి జవాబు దారి తనంతో ముందుకు తీసుకువెళ్తానని.. అవినీతి రహిత రాజకీయాలే తన లక్ష్యమని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరు.. ప్రభుత్వాన్నీ నిలదిస్తున్న పవన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తనకి అందించిన మద్దతుకి రుణపడి ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు.