Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఏలూరు సభలో వాలంటీర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ప్రారంభించినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం వేరే కావచ్చని ఇప్పుడు మాత్రం ప్రజల సున్నితమైన సమాచారం ఎటు వెళ్తుందో ఎవరికి తెలుసని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల ఆయన సారీ చెప్పాలంటూ వాలంటీర్స్ రోడెక్కారు. అయిన కూడా పవన్ తగ్గేదే లే అంటూ వాలంటీర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏలూరులో జనసేన నాయకులు, వీర మహిళలతో సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కేవలం రూ. 5 వేలకే యువతను ఊడిగం చేయమంటున్నారని విమర్శించారు
ఢిల్లీలో కూర్చున్న పెద్దలు, నిఘా సంస్ధల వ్యక్తులు ఏపీలో ఇన్ని వేల మంది అమ్మాయిలు మిస్సవుతున్నారని ఓ పార్టీ అధినేత తనను అడిగారని పవన్ తెలిపారు. ప్రభుత్వంలో పనిచేసే కొంత మంది కుమ్మక్కయ్యారని తనకు చెప్పారన్నారు అపార్ట్ మెంట్లో టూలెట్ బోర్డు పెడితే ఇద్దరు, ముగ్గురు కుర్రాళ్లకు ఊరికే అద్దెకివ్వరని, ఎన్నో విషయాలు ఆలోచిస్తారని పవన్ తెలిపారు. వాలంటీర్లలో మహిళల గురించి తాను మాట్లాడటం లేదని, బ్యాచ్ లర్లకు డేటా సేకరణ బాధ్యత ఇచ్చారని, వారి దగ్గర కుటుంబాల డేటా చాలా ఉంటోందని పవన్ తెలిపారు. జగన్ వాలంటీర్ల వ్యవస్ధ మొదలుపెట్టినప్పుడు వారి ఉద్దేశం వేరై ఉండొచ్చని, కానీ సమాచారం అనేది చాలా సున్నితమన్నారు.
గ్రామాల్లో తల్లితండ్రులు ఇళ్లలో లేనప్పుడు మహిళల సున్నితమైన డేటా తీసుకుంటున్నారని ఆరోపించారు. పంచాయతీరాజ్, రెవెన్యూ వ్యవస్ధలుండగా వాలంటీర్ల పేరుతో మరో సమాంతర వ్యవస్ధ ఎందుకన్నారు. . ప్రజల విలువైన సమాచారాన్ని వారు ఎందుకు సేకరిస్తున్నారని నిలదీశారు. వాలంటీర్లు ఎవరో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. వారి సమాచారం కలెక్టర్లు, ఎస్పీల వద్ద ఉండాలని పేర్కొన్నారు. వారిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ ఉండాలని.. వాలంటీర్ వ్యవస్థ పట్ల కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.ఈ వ్యవస్థను ఇప్పుడే అదుపులో పెట్టాలని.. వాలంటీర్ల వ్యవస్థ ప్రమాదకరంగా మారుతోందని పవన్ కళ్యాణ్ మరోమారు హెచ్చరించారు.