Pawan Kalyan : ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఏపీలోని ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘవిద్రోహశక్తులకు వాలంటీర్లు ఇస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాలు వెల్లువెత్తుతుండడం మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే మహిళా కమిషన్ ఆయనను వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.
అయితే ఎవరెంత రచ్చ చేసిన కూడా పవన్ మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా ఉన్నారు. ఏలూరులో జనసైనికులు, వీరమహిళలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వాలంటీర్లలో మహిళల గురించి తాను మాట్లాడటం లేదని, బ్యాచ్ లర్లకు డేటా సేకరణ బాధ్యత ఇచ్చారని, వారి దగ్గర కుటుంబాల డేటా చాలా ఉంటోందని పవన్ తెలిపారు. గ్రామాల్లో తల్లితండ్రులు ఇళ్లలో లేనప్పుడు మహిళల సున్నితమైన డేటా తీసుకుంటున్నారని ఆరోపించారు. పంచాయతీరాజ్, రెవెన్యూ వ్యవస్ధలుండగా వాలంటీర్ల పేరుతో మరో సమాంతర వ్యవస్ధ ఎందుకని ప్రశ్నించారు పవన్.
ఐదు వేల రూపాయలు తీసుకునే వాలంటీర్లలో కొంతమంది తప్పుచేస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్ల డేటా తీసుకునే హక్కు అందరికీ ఉండాలన్నారు. ప్రతీ ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల్లో వాలంటీర్ల డేటా పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. ముసలి తల్లితండ్రుల్ని మీ పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు కదా అంటూ కొందరు వాలంటీర్లు బెదిరిస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్ధను జాగ్రత్తగా చూడాలన్నారు. వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, వాళ్ల పని చేస్తే ఇబ్బంది లేదని, ప్రభుత్వానికి మాత్రమే పనిచేస్తామంటే కుదరదని పవన్ స్పష్టం చేశారు. పవన్‌కి వ్యతిరేఖంగా పెద్ద ఎత్తున ధర్మాలు చేస్తున్న సమయంలో కూడా పవన్ వాలంటీర్స్ గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.