Undavalli Arun Kumar : మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఏపీలో అధికార వైసీపీ భవిష్యత్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన కామెంట్స్ చేవారు. పార్టీ లక్ష్యాలు, ఆశాయాలను పాటించకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ మనుగడ కష్టమేనని అన్నారు. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్టీ పరంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో తీసుకుంటున్న చర్యలపై స్పందించారు. ఓ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేకు మరో చోట టికెట్ మార్చడం ఎంతో కష్టమైన పని అని, ఇది ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పని అని స్పష్టం చేశారు. కానీ జగన్ ఆలోచనలు చూస్తే అలా కనిపించడంలేదని అన్నారు.
గతంలో తనను సీఎం చేయాలని సోనియాను స్వయంగా అడిగినప్పుడో, ఇతరులతో అడిగించినప్పుడో జగన్ లో ఎలాంటి ఫీలింగ్ ఉందో… ఇప్పుడు టికెట్ మార్చిన ఎమ్మెల్యేల్లోనూ అలాంటి బాధాకరమైన ఫీలింగే ఉందని ఉండవల్లి వివరించారు. అధికారం అంతా జగన్ కు, వాలంటీర్లకు మధ్యనే ఉందని, మరి ఎమ్మెల్యేలకు అధికారం ఎక్కడుందని ఉండవల్లి ప్రశ్నించారు. అధికారం లేకుండా ఎమ్మెల్యేలకు గ్రాఫ్ పెరగలేదంటే ఎలా? అని వ్యాఖ్యానించారు. వైఎస్ పేరుతో పార్టీ ఏర్పాటు చేసి, లక్ష్యాలు, ఆశయాలకు దూరంగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే పార్టీ మనుగడే ప్రమాదంలో పడుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు పవర్ లేకుండా చేయడంతో ఎమ్మెల్యేల పని సామర్ధ్యం ఎక్కడ పెరుగుతుందని అన్నారు. సంక్షేమాల పేరిట ప్రభుత్వ నిధులను ప్రజలకు పంపిణీ చేయడం ఒక్కటే సరిపోదని వెల్లడించారు.సీట్ల మార్పుపై వ్యూహాత్మకంగా వ్యవహరించక పోతే నష్టం తప్పదని హెచ్చరించారు. సగం వరకు సిట్టింగ్ స్థానాల్లో మార్పులు, చేర్పులు చేస్తుండడం వల్ల సొంత పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.