CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనాధికారులకు స్థానచలనం కలుగుతోంది. మరీ ముఖ్యంగా ఐఏఎస్ , ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. గతంలో ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో ఏడుగురిని బదిలీ చేసింది. ఇందులో ఆరుగురు ఐఏఎస్‌లు ఉండగా..ఒక ఐపీఎస్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాదు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్‌లు, ఐఏఎస్‌లతో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
రోజుకు 18 గంటలు పని చేయాలని సూచించారు. అలా పని చేయడం కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు. పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సీఎస్, డీజీపీకి చెప్పి బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు. బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉన్నంత వరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగలమనే ఆలోచనతో ఉండాలన్నారు.
అధికారులకు మానవీయ కోణం చాలా ముఖ్యమన్నారు. తెలంగాణ డీఎన్ఏలోనే స్వేచ్ఛ ఉందన్న సీఎం.. ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా కలిసి పనిచేద్దామన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులకు ఫుల్ పవర్ ఇస్తున్నామన్నారు. అక్రమార్కులు, అవినీతి పరులు, భూకబ్జా దారులను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించవద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి అన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని కోరారు. ప్రజా సమస్యలను మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కరించాలన్నారు.