TDP And BJP : ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల లెక్కలు కీలకం అవుతున్నాయి. కొంత కాలంగా సస్పెన్స్ గా ఉన్న టీడీపీ, బీజేపీ పొత్తుపైన స్ఫష్టత మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్‌ని ఓడించేందుకు జనసేనతో పొత్తు పెట్టుకోగా, దీంతో పాటుగా కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరుతుందని గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు మోదీ విధానాలను సమర్థిస్తానని ఇటీవలి కాలంలో చాలా సార్లు ప్రకటించారు. అయోధ్య కూడా వెళ్లి వచ్చారు. అందుకే ఏపీలో మళ్లీ 2014 కూటమి ఖాయమన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది.
ఏపీలో వచ్చే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరగవని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. వ్యవస్థల్ని అదుపులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పాల్పడతారని నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే కేంద్రం మద్దతు ఉండాలని భావిస్తున్నారు. బీజేపీ తమకు మద్దతుగా ఉండకపోయినా… వైసీపీకి సపోర్ట్ గా ఉండవద్దని కనీసం న్యూట్రల్ గా అయినా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. అందుకే తాము హితులమే అని చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ ఉద్దేశం కూడా అదే అని అంటున్నారు.
నమ్మకమైన మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యారు. బీజేపీ రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడానికి కారణం ఉత్తరాది… హింందీ రాష్ట్రాలు. అక్కడ 95 శాతం సీట్లు సాధించడం ద్వారానే ఢిల్లీ పీఠం దక్కింది. రెండు సార్లు జరిగిన అద్భుతం మూడో సారి జరగకపోతే సీట్ల కోత పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే బీజేపీకి ఇబ్బందికరం అవుతుంది. దక్షిణాదిపై ఆ పార్టీకి ఆశలు లేవు. అందుకే ఇప్పుడు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షం కావాలి. వైసీపీ ఎలాగూ కూటమిలో చేరదు. టీడీపీకి కూటమిలో చేరే ఆప్షన్ ఉంది. నిజానికి టీడీపీ, బీజేపీ కలిసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. 2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేశారు. విజయం సాధించారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో కలిసి ఘోర పరాజయం పాలయ్యారు. అంతకు ముందు కూడా బీజేపీ, టీడీపీ కూటమిగా మారితే చాలా విజయాలు దక్కాయి.